శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా. మహిళా సాధికారతకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహోన్నత సేవ – ఉచిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి మార్గం- శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు*
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్య అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, విశాఖపట్నం జిల్లా సింహాచలం సమితి పరిధిలోని చినముషిడివాడ భజన మండలి మందిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ R. లక్ష్మణరావు గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఉచిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కుట్టు శిక్షణ వంటి నైపుణ్యాలను అందించి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం సంస్థ యొక్క ముఖ్య సేవా లక్ష్యాలలో ఒకటని ఆయన వివరించారు.
ఇందులో భాగంగా గత 30 రోజులుగా చినముషిడివాడ మందిరంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఒక నిరుపేద మహిళకు కుట్టు యంత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ గౌరవప్రదమైన జీవనోపాధి సాధించగలరని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, తద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
అదే విధంగా శ్రీ లక్ష్మణరావు గారు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలలో బాలవికాస్ అభివృద్ధి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండాలని సూచించారు. చిన్నారుల్లో మానవ విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో బాలవికాస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అలాగే నిత్య నారాయణ సేవా కార్యక్రమాన్ని (ఉచిత భోజన ప్రసాద సేవా కార్యక్రమం ) మరింత విస్తృతంగా నిర్వహిస్తూ, అవసరమైన దీనులకు ప్రతి రోజూ క్యారేజీల ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో ఓంకార జపం, సుప్రభాతం పఠనం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి పొందవచ్చని ఆయన భక్తులకు వివరించారు.
ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆశీర్వదిస్తూ వారికి ఎగ్జామినేషన్ ప్యాడ్ కిట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, రాష్ట్ర సేవా విభాగం జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ డి. రాఘవరావు, సింహాచలం సమితి పదాధికారులు, జిల్లా పదాధికారులు మరియు అనేక మంది భక్తులు పాల్గొని స్వామి కృపను అనుభవిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ కార్యక్రమం ద్వారా సేవ ద్వారా సమాజోద్ధరణ, మహిళా సాధికారత, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ అనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహోన్నత లక్ష్యం మరోసారి ప్రతిఫలించింది.


Comments
Post a Comment