*విశాఖ స్టీల్‌పై కీలక భేటీ… కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా*
సమావేశంలో తొలుత విశాఖ స్టీల్ పునరుద్ధరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పల్లా శ్రీనివాసరావు గారు అభినందించారు. ఆర్థిక ప్యాకేజీ అనంతరం ప్లాంట్ పరిస్థితి మెరుగుదల దిశగా సాగుతున్న నేపథ్యంలో, సంస్థపై ఉన్న ఆర్థిక భారం తగ్గడం, ఉత్పత్తి కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలకు కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎండీ శ్రీ అజిత్ కుమార్ సక్సేనా గారి సేవలను పల్లా గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. అదే విధంగా సంస్థను లాభదాయక దిశగా తీసుకెళ్లేందుకు సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రస్తుత యాజమాన్యం, అధికారుల కృషిని పల్లా గారు అభినందించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు మంత్రి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలంటే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం అత్యవసరమని స్పష్టం చేశారు. ప్లాంట్ నిర్వహణ ఖర్చులను కట్టుదిట్టంగా నియంత్రిస్తూ, సామర్థ్యాన్ని పెంచే దిశగా అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమర్థవంతమైన నిర్వహణతో ప్లాంట్‌ను స్థిర లాభాల దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా నిర్వాసితుల సమస్యలు, R-కార్డు హోల్డర్లకు ఎదురవుతున్న ఆధార్ బ్లాకింగ్ సమస్యలు, అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పెండింగ్ జీతాల అంశాలపై దృష్టి సారించి, వీటికి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. ప్లాంట్ అభివృద్ధిలో కీలక భాగస్వాములైన ఉద్యోగులు, నిర్వాసితులకు న్యాయం చేయడం అవసరమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పల్లా గారు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందని తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఉక్కు అత్యుత్తమ నాణ్యతతో, దీర్ఘకాలిక మన్నికతో నిర్మాణ రంగంలో విశ్వసనీయతను సంపాదించిందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ఉత్పత్తులు నిర్మాణ రంగానికి బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని, ఈ ప్రతిష్టను మరింత పెంచే దిశగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, యాజమాన్యం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే విశాఖ స్టీల్‌ను మరింత బలోపేతం చేసి లాభదాయక సంస్థగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment