సెయింట్ జోసెఫ్ అధ్యాపకునికి ఎ యు కాన్వకేషన్ లో బెస్ట్ థీసిస్ అవార్డు గవర్నర్ ద్వారా ప్రదానం గ్రామీణ నేపథ్యం నుంచి శిఖరాలకు – డా. దాసరి కోటేశ్వరరావు ప్రేరణాత్మక విజయగాథ
ఒక రైతు బిడ్డగా పుట్టిన ఆయన, తమ గ్రామంలో పీహెచ్.డి పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచి, గ్రామానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించడంలో ఆయన చూపిన పట్టుదల యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
డా. దాసరి కోటేశ్వరరావు మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఎక్కడా ఆగకుండా తన విద్యా ప్రయాణాన్ని కొనసాగించారు. పీహెచ్.డి వరకు పలు విద్యార్హతలను సాధించడం ద్వారా తన ప్రతిభను నిరూపించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగంలో ప్రొఫెసర్ కే. ఏడుకొండలు ఆధ్వర్యంలో “వ్యాస మహాభారతం మరియు ఆంధ్ర మహాభారతం – వికృతి దృష్టికోణంలో తులనాత్మక అధ్యయనం” అనే విశిష్ట అంశంపై పీహెచ్.డి పూర్తి చేసి పరిశోధనా రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆయన చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన 91వ & 92వ కాన్వకేషన్‌లలో “బెస్ట్ థీసిస్ అవార్డు” లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించడం ఆయన సాధించిన విజయానికి మరింత గౌరవాన్ని చేకూర్చింది.ప్రస్తుతం డా. దాసరి కోటేశ్వరరావు విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల సంస్కృత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. బోధనలోనూ, పరిశోధనలోనూ ఆయన చూపుతున్న నిబద్ధత విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ, కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు పి.ఆర్.ఓ డా. పి.కె. జయలక్ష్మి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ విజయానికి కారణమైన తన తల్లిదండ్రులు, గురువులు మరియు జీవిత భాగస్వామికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు



Comments
Post a Comment