ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం కోసం రంజాన్ ప్రార్థనలు* *ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణతో సమాజ శ్రేయస్సుకు మార్గం చూపే పవిత్ర మాసం* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
విశాఖపట్నం, మార్చి 21:* ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గాజువాక ఈద్గా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొని ముస్లిం సోదరులతో ఆత్మీయంగా కలిసిమెలిసి పండుగ ఆనందాలను పంచుకున్నారు.
రంజాన్ మాసం ఆధ్యాత్మిక శుద్ధి, ఆత్మ నియంత్రణ, సహనం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ద్వారా శరీరం, మనస్సు, ఆత్మలను నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో జీవించాల్సిన అవసరాన్ని ఈ పవిత్ర మాసం గుర్తుచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రంజాన్ మాసం ప్రతి మనిషిలో స్వీయ నియంత్రణ (Self Control), క్రమశిక్షణ (Self Discipline), దయ, సహానుభూతి వంటి విలువలను పెంపొందించే మహత్తర సాధనమని పేర్కొన్నారు. వ్యక్తి తనలోని లోపాలను జయించి, మంచి ఆలోచనలు అలవర్చుకుంటేనే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు.
ప్రపంచంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలనతో పాటు ఆత్మ నియంత్రణను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పల్లా స్పష్టం చేశారు. రంజాన్ మాసం అదే సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments
Post a Comment