10వ అఖిల భారత సేవాదళ సమావేశం | కళైమామణి మనో & ఆర్కెస్ట్రా భక్తి సంగీత కార్యక్రమం


ప్రశాంతినియం :విశాఖ సందేశం వర్తవాహని :భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రెండు రోజుల అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ సమావేశం రెండవ రోజు కార్యక్రమాలు సాయికుల్వంత్ సభామండపంలో ఘనంగా జరిగాయి.

వేద పారాయణం, భగవాన్ వారి దివ్య సందేశ ప్రసారం అనంతరం, జాతీయ సేవా కోఆర్డినేటర్ శ్రీ ఎస్.కోటేశ్వరరావు రావు గారు సేవ – ముక్తికి మార్గం అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ సత్యసాయి సంస్థ విస్తరణను వివరిస్తూ, ఒక చిన్న భజన మండలి రూపంలో ప్రారంభమైన సంస్థ నేడు దేశవ్యాప్తంగా 460 రెవెన్యూ జిల్లాల్లో 3,055 సేవా సమితులు, 4,022 భజన మండళ్లతో విస్తరించిందని తెలిపారు. సంస్థలో మూడు లక్షల మంది సేవాదళ సభ్యులు ఉండగా, వారిలో 1,45,000 మంది పురుషులు, 1,55,000 మంది మహిళలు ఉన్నారని వివరించారు.

Celebrating Being and Becoming’ అనే సమావేశ ఇతివృత్తాన్ని వివరిస్తూ, ప్రతి సేవాదళ సభ్యుడు భగవాన్ వారి దివ్య గుణాలను అలవరచుకుని, తొమ్మిది సూత్రాల ప్రవర్తనా నియమావళిని నిత్య జీవితంలో మార్గదర్శకంగా పాటించాలని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధిలో మహిళలు, బాల వికాస్, యువత అందిస్తున్న విశేష సేవలను ప్రస్తావిస్తూ, సమాన అవకాశాలు, నాయకత్వ బాధ్యతలు కల్పించడంలో ‘Be, Do, Tell’ అనే సూత్రం ప్రాముఖ్యతను వివరించారు. సేవాదళ కండువా, సంస్థ చిహ్నం అనేవి కేవలం పదవులు, బాధ్యతలకు సంబంధించినవి మాత్రమే కాకుండా, జీవితాంతం స్వామి వారి ఆదర్శాలకు కట్టుబడి ఉండాలనే సంకల్పానికి ప్రతీకలని గుర్తుచేశారు.

ముగింపు ప్రసంగంలో శ్రీ నిమిష్ పాండ్యా గారు, అఖిల భారత అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,  సేవాదళ సభ్యులను సాయిరాముని సేవలో నిమగ్నమైన లక్షలాది హనుమంతులతో పోల్చారు. భగవాన్ వారి ప్రేమ, సేవలకు అంకితమైన జీవితాల ద్వారా రామరాజ్య స్వప్నం సాకారమవుతుందని పేర్కొన్నారు.

ప్రతి సేవాదళ సభ్యుడు అచంచల విశ్వాసం, ఆత్మ పరివర్తన, ‘Love All, Serve All’ మరియు ‘Help Ever, Hurt Never’ అనే సూత్రాల ఆచరణ ద్వారా భగవంతునికి యోగ్యమైన సాధనంగా మారాలని పిలుపునిచ్చారు. స్వామి వారిని మనలోనే దర్శించుకుంటూ, ఆయన సర్వవ్యాపకత్వాన్ని గుర్తించాలని, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ప్రతి బాధ్యతను వినయంతో నిర్వర్తించాలని సూచించారు. నిరంతర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, ఒక పనిని వెయ్యి శాతం మెరుగ్గా చేయడం కంటే, వెయ్యి పనులను ఒక్కొక్కటి ఒక శాతం మెరుగ్గా చేయడం ఎంతో శ్రేయస్కరమని వివరించారు.

అనంతరం ప్రశాంతి నిలయంలోనూ, దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సేవాదళ సభ్యులకు పతకాల ప్రదానం జరిగింది. హాంకాంగ్‌కు చెందిన శ్రీమతి ఇసబెల్లా రూపొందించిన ఈ పతకాలను తొలుత మహిళా విభాగానికి చెందిన ముగ్గురు జాతీయ సమన్వయకర్తలకు, దేశంలోని మహిళా సేవాదళ సభ్యులందరి తరఫున ప్రదానం చేశారు. అనంతరం సంస్థ పదాధికారుల ద్వారా పురుష సేవాదళ విభాగ ప్రతినిధులకు పతకాలను అందజేశారు.

సాయంత్రం కార్యక్రమంలో కళైమామణి శ్రీ మనో గారు మరియు ఆర్కెస్ట్రా బృందం సమర్పించిన ‘భక్తి వైభవం’ భక్తి సంగీత కార్యక్రమం ప్రేక్షకులను భక్తి భావంలో ముంచెత్తింది. పుట్టపర్తితో తనకున్న చిరస్మరణీయ అనుబంధాన్ని, భగవాన్ వారి దివ్య సన్నిధిలో గానం చేసే భాగ్యం, ముఖ్యంగా భగవాన్ వారి 70వ జన్మదిన సందర్భంగా స్వర్ణ రథోత్సవంలో గానం చేసిన అపూర్వ అనుభూతిని ప్రముఖ నేపథ్య గాయకుడు స్మరించుకున్నారు.

భక్తి గీతాలు, శ్లోకాలు, శ్రీ రుద్రంలోని మంత్రాల ఆలాపనతో భగవంతుని మహిమను కీర్తిస్తూ, శ్రీ గణేశుడు, పరమశివుడు, నటరాజ స్వామి వారి దివ్య స్వరూపాలను సంగీతం ద్వారా ఆవిష్కరించారు. భగవాన్ వారు శివశక్తి స్వరూపులని కీర్తిస్తూ, వారి దివ్య పాదపద్మాలను స్తుతించే గీతాలతో సాయికుల్వంత్ సభామండపం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ సంగీత సమర్పణలో సర్వదైవ స్వరూపమైన పరబ్రహ్మ ఒక్కటే అనే సత్యాన్ని చాటిచెప్పే చిరస్మరణీయ గీతం ‘బ్రహ్మమొక్కటే’ కూడా ఆలపించారు. చివరగా ‘స్వర్ణ రథం సాయి రథం’ గీతంతో భగవాన్ వారి మహిమను, విశ్వవ్యాప్త ప్రేమ, శాంతి సందేశాన్ని హృదయపూర్వకంగా కీర్తిస్తూ సంగీత కార్యక్రమం ముగిసింది. అనంతరం భజనలు, మంగళ హారతితో సాయంత్రపు కార్యక్రమాలు ముగిశాయి.

Post a Comment

0 Comments