ఆంధ్రవిశ్వవిద్యాలయం, నవంబర్ 16:ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫార్మశీ కళాశాలలో ఆధునీకరించిన ఫార్మాస్యూటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ , ఫ్యాకల్టీ రూములను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ ఫార్మశీ కళాశాల ఆధునీకరణ, అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం నిరుపమానమన్నారు. ఉన్నతంగా ఎదిగిన పూర్వ విద్యార్థులతో నేటి తరాన్ని అనుసంధానించే విధంగా ఏయూ-సేతుకార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దీనిలో సభ్యులుగా చేరి విలువైన మార్గదర్శకం పొందాలని విద్యార్థులకు సూచించారు.
ఫార్మశీ కళాశాల గౌరవ ఆచార్యులు ప్రొఫెసర్ జె. విజయ రత్న (రిటైర్డ్), తన అత్తమామలైన శ్రీ జయంతి దీక్షితులు గారు మరియు శ్రీమతి జయంతి అనసూయ గారి జ్ఞాపకార్ధం ఈ రీసెర్చ్ లాబ్‌ను ఆధునీకరించి కళాశాలకు అందించారు. విద్యార్థులకు ఉపయుక్తంగా నిలచే ప్రయోగశాలను ఆధునీకరించడం పట్ల వీసీ సంతోషం వ్యక్తం చేశారు. దాతను విశ్వవిద్యాలయం తరపున అభినందించి, సత్కరించారు.
ఏయూ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థులు న్యూ జెర్సీ బృందం కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయడానికి సిద్ధమవుతోందని చెప్పారు. ఇటీవల తాను అమెరికా సందర్శించిన సమయంలో పెద్ద సంఖ్యలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు అక్కడ సమావేశానికి హాజరు కావడం, విశ్వవిద్యాలయం పట్ల, తాము చదువుకున్న కళాశాల పట్ల వారు చూపిన అమితమైన ప్రేమాభిమానాలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయన్నారు.
డ్రగ్ డెవలప్‌మెంట్‌పై వర్క్ షాప్.......ఫార్మశీ కళాశాల ఆధ్వర్యంలో "మోడల్ ఇన్ఫార్మ్డ్ డ్రగ్ డెవలప్‌మెంట్ (MIDD)" పై జాతీయ వర్క్‌షాప్ ను ప్రారంభించారు. ఫార్మశీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్క్‌షాప్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ...వర్తమాన అభివృద్ధి చెందుతున్న అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచే విధంగా ఇటువంటి వర్క్‌షాప్‌లను నిర్వహించడం ఎంతో ప్రధానమన్నారు. నిర్వాహకులను అభినందించారు.వర్క్‌షాప్‌కు రిసోర్స్ పర్సన్స్ గా 6-S ఫార్మా ఫౌండర్, యూనివర్శిటీ ఆఫ్ పసిఫిక్ (కాలిఫోర్నియా) అడ్జంక్ట్ ప్రొఫెసర్ కృష్ణ ఆర్. దేవరకొండ, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మశీ విభాగాధిపతి డాక్టర్ కె.టి. సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. విశ్రాంత ఆచార్యులు జె.విజయరత్న సదస్సుకు సహకారం అందించగా, ప్రిన్సిపాల్ ఆచార్య జి.గిరిజా శంకర్, కన్వీనర్ గా, ఆచార్య పి.శైలజ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సదస్సును సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.


0 Comments