ఘనంగా శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవం గవర్నర్ గారి స్ఫూర్తిదాయక సందేశంతో పట్టభద్రుల్లో నూతనోత్సాహం.. వికసిత భారత్ నిర్మాణానికి పిలుపు


పుట్టపర్తి, నవంబర్ 22, 2026: శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవం నేడు ప్రశాంతి నిలయంలో అత్యంత వైభవంగా, పవిత్ర వాతావరణంలో నిర్వహించబడింది. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ ఘనంగా స్వాగతం పలికారు.


గవర్నర్ గారు తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలోని భజన మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రార్థనలు సమర్పించి ఆశీస్సులు పొందారు.


అనంతరం ఆశీర్వచనం స్వీకరించి స్వామివారి దివ్య సన్నిధికి వినమ్రంగా నమస్కరించారు.తదుపరి యజుర్ మందిరం నుంచి పూర్ణచంద్ర ఆడిటోరియం వరకు వేడుకల ఊరేగింపు ప్రారంభమైంది. అనంతపురం బ్రాస్ బ్యాండ్ ‘హమ్ తేరే హై సాయి’ అనే మధురమైన గీతాన్ని ఆలపిస్తూ ఊరేగింపుకు ముందుండగా, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, విభాగాధిపతులు, డీన్లు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలు, ముఖ్య అతిథి తదితర ప్రముఖులు ఊరేగింపులో పాల్గొన్నారు.


పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రముఖులు చేరుకున్న అనంతరం ఇన్‌స్టిట్యూట్ బ్రాస్ బ్యాండ్ జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆలపించింది. అనంతరం అనంతపురం క్యాంపస్ విద్యార్థులు వేదమంత్రాల పఠనంతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు.


ఇన్‌స్టిట్యూట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. రాఘవేంద్ర ప్రసాద్ ముందుగా దివ్య వ్యవస్థాపక ఛాన్సలర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు కోరుతూ స్వాగతోపన్యాసం చేశారు.*


2025-26 విద్యా సంవత్సరంలో ఇన్‌స్టిట్యూట్ సాధించిన విశేష విజయాలను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థుల ప్రతిభా విజయాలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చేపట్టిన కార్యక్రమాలు, ఎస్.ఎస్.ఎస్.ఐ.హెచ్.ఎల్. ద్వారా లేదా దాని సహకారంతో స్థాపించబడిన సంస్థలు చేపట్టిన వివిధ మానవతా సేవా కార్యక్రమాలను వివరించారు. ఇన్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థుల విశేష సేవలు, వృత్తిపరంగా సాధించిన ఉన్నత విజయాలు, తమ విద్యాసంస్థతో కొనసాగిస్తున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.


స్వాగతోపన్యాసం అనంతరం ముఖ్య అతిథి గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఛాన్సలర్ విద్యార్థులకు వారి వారి డిగ్రీలను ప్రదానం చేయడానికి అధికారికంగా అనుమతి ప్రకటించారు. వైస్ ఛాన్సలర్ స్నాతకోత్సవ ప్రతిజ్ఞ చేయించగా, స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులందరూ ప్రతిజ్ఞను గంభీరంగా స్వీకరించారు.


వివిధ కోర్సులు, డిగ్రీలలో విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు గవర్నర్ గారు బంగారు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ERP వెబ్‌సైట్‌ను, ‘Algorithmic Actuaries’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా సభలోని వారందరూ ‘హమ్‌కో తుమ్‌సే ప్యార్ కిత్నా’ అనే స్నాతకోత్సవ గీతాన్ని ఆలపించారు.


స్నాతకోత్సవ ముఖ్యోపన్యాసంలో గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు పట్టభద్రులైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనల స్ఫూర్తితో విలువల ఆధారిత సమగ్ర విద్యను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్ సేవలను ప్రశంసించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో పట్టభద్రులు అర్థవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వంటి ఆధునిక సాంకేతికతలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంతో పాటు, సృజనాత్మకత, ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిజాయితీతో కూడిన ప్రయత్నంలో తప్పులు సహజమని పేర్కొంటూ, “వైఫల్యం అంతిమం కాదు, విజయం కూడా అంతిమం కాదు” అని విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన మాటలను ఉటంకించారు. డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు యువతలోని అంతర్గత జ్వాలను వెలిగించి, దానికి రెక్కలు అందించాలన్న స్ఫూర్తిదాయక సందేశాన్ని కూడా గౌరవ గవర్నర్ గుర్తుచేశారు.


యువ పట్టభద్రుల్లో అపారమైన ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేసిన గవర్నర్ గారు, భవిష్యత్తులో వారు దేశంలో అత్యున్నత పదవులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ శాస్త్రవేత్తల స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తమ ఎదుగుదలకు తోడ్పడిన తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారికి కృతజ్ఞతతో ఉండాలని హితవు పలికారు.అనంతరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశం సభికులకు వినిపించబడింది. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనున్న పట్టభద్రులకు ఆ దివ్య సందేశం శాశ్వతమైన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించింది.

జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో 45వ స్నాతకోత్సవ కార్యక్రమం ముగిసింది.

Post a Comment

0 Comments