విశాఖపట్నం: సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి), విశాఖపట్నంలోని భాషా విభాగాలు మరియు ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ బహుభాషా సదస్సుకు అనుబంధంగా రూపొందించిన పరిశోధనా పత్రిక ‘శోధ్ సమాగమ్’ ప్రత్యేక సంచికను కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. ఆవిష్కరించారు. అనంతరం పత్రికను సంపాదకురాలు డా. పి. కె. జయలక్ష్మికి అందజేశారు.
“భాషలు మరియు సాహిత్య అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు పాత్ర” అనే అంశంపై రూపొందించిన ఈ పరిశోధనా పత్రికలో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం, ఫ్రెంచ్ అనే ఐదు భాషలకు చెందిన మొత్తం 65 పరిశోధనా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. వివిధ భాషలకు చెందిన పరిశోధకులు, అధ్యాపకులు సమర్పించిన వ్యాసాలు కృత్రిమ మేధస్సు భాషా బోధన, అనువాదం, సాహిత్య సృజన, పరిశోధన, భాషా పరిరక్షణ రంగాల్లో కల్పిస్తున్న అవకాశాలను విశ్లేషిస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. మాట్లాడుతూ, ఐదు భాషల్లో 65 పరిశోధనా వ్యాసాలతో బహుభాషా పరిశోధనకు వేదికగా ఈ ప్రత్యేక సంచిక రూపొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భాషా సాహిత్య అభివృద్ధికి వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. టి. భాస్కర సుధ, భాషా విభాగాల అధ్యాపకులు, కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు పత్రిక ప్రత్యేక సంచిక సంపాదకురాలు డా. పి. కె. జయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ ప్రచురణ కళాశాల పరిశోధనా కార్యకలాపాలకు, బహుభాషా సాహిత్య వికాసానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.


0 Comments