జర్నలిస్టుల భద్రత ప్రభుత్వ బాధ్యత కావలిలో ఈనాడు విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.. జర్నలిస్టులకు భద్రత కల్పించాలి


విశాఖపట్నం: నెల్లూరు జిల్లా కావలిలో ఈనాడు దినపత్రిక విలేకరి సుబ్బారావుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటాన్ని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఆయన అభివర్ణించారు. జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కావలిలోని పెదపవని రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దాటిన తర్వాత ఐదుగురు యువకులు సుబ్బారావు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. బాధితుడు కిందపడిపోయి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోవడం గమనించిన దుండగులు పరారయ్యారని పేర్కొన్నారు. గతంలోనూ తనపై దాడికి యత్నించారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితుడు వెల్లడించారని తెలిపారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన వాగ్వాదానికి ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరపాలని గంట్ల శ్రీనుబాబు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా విశాఖ జిల్లా అర్బన్ అధ్యక్షులు పి. నారాయణ, జి. శ్రీనివాసరావు

బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాస్ కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

వార్తలు రాసే కలాన్ని బెదిరింపులతో ఆపలేరు. జర్నలిస్టులపై దాడులను సహించేది లేదు. పత్రికా స్వేచ్ఛను కాపాడటంతో పాటు విలేకరులకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments