ఆంధ్రవిశ్వవిద్యాలయం, నవంబర్ 14:న్యాయ శాస్త్రంపై పట్టు సాధించండి, ఆధునిక సాంకేతిక సాధనాలపై ప్రావీణ్యం సంపాదించండి, అదే సమయంలో మీ మేధస్సును ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలలో బలంగా పాతుకుపోయేలా ఉంచండి అని భారత పూర్వ రాష్ట్రపతి గౌరవ శ్రీ రామ్‌నాథ్ కోవింధ్ అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహంచిన జస్టిస్ కె.రామస్వామి స్మారకోపన్యాసంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి డిజిటల్ యుగంలో న్యాయవాద వృత్తి- అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్సహాయుల పక్షాన నిలబడంటం, భయం లేకుండా సత్యాన్ని సమర్థించడం, గణతంత్ర దేశంలో న్యాయపు వెలుగు అందరికీ ప్రకాశవంతంగా, సమానంగా ప్రసరించేలా చూడాలని యువతకు సూచించారు.
మానవ గౌరవాన్ని, చట్టబద్ధమైన పాలనను (Rule of Law) కాపాడటానికి తమ జీవితాలను అంకితం చేసిన ఇద్దరు అసాధారణ మేధావులైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న న్యాయ కళాశాలలో, జస్టిస్ రామస్వామి గారి స్మారకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావడం వారిరువురికి నివాళులర్పించడమేనన్నారు.
జస్టిస్ కె. రామస్వామి గారి జీవిత ప్రయాణం, ఆయన చేసిన కృషి న్యాయ వ్యవస్థకు ఒక ముఖ్యమైన నైతిక దిక్సూచిగా నిలుస్తాయన్నారు. చట్టం అనేది కేవలం పరిపాలనా సాధనం మాత్రమే కాదని, అది అణగారిన వారిని ఉన్నతంగా నిలపడానికి, సామాజిక అంతరాలను తగ్గించడానికి, ప్రతి భారతీయుడికి నిజమైన గౌరవాన్ని అందించడానికి ఉద్దేశించిన నైతిక యంత్రమని జస్టిస్ రామస్వామి గారు నిరూపించారన్నారు.ఈ ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ విరాళాన్ని పూర్వ విద్యార్థి మరియు వారి జీవిత భాగస్వామి ఇద్దరి పేర్ల మీద సంయుక్తంగా నమోదు చేయాలని చెప్పారు.
నేడు మనం మానవ చరిత్రలో ఒక కీలకమైన మలుపులో నిలబడి ఉన్నామని, డిజిటల్ సాధనాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జీవితంలోని ప్రతి రంగాన్ని సమూలంగా మారుస్తున్నాయన్నారు. న్యాయ వృత్తి కూడా దీనికి అతీతం కాదని. డిజిటల్ యుగం న్యాయ వృత్తికి కొత్త అవకాశాలతో పాటు కొత్త సవాళ్లను కూడా తెచ్చిపెట్టిందన్నారు. జిల్లా కోర్టులోని సాధారణ న్యాయవాదికి కూడా కార్పొరేట్ న్యాయవాదికి ఉన్నంత డిజిటల్ వనరులు అందుబాటులో ఉండేలా మనం చూడాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య పౌరుడు కూడా ఈ కొత్త డిజిటల్ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకునేలా సాధికారత కల్పించాలన్నారు.నేడు ఏఐ సాంకేతికత మనకు అందుబాటులో వచ్చిందని, ఇది వేగం మరియు విస్తృతికి అపూర్వమైన అవకాశాలను తెరుస్తోందన్నారు. అప్రమత్తమైన మానవ పర్యవేక్షణ ఆవశ్యకతను ఎన్నడూ వదులుకోకూడదని, ప్రతి దశలోనూ మానవ ప్రమేయం అత్యంత ఆవశ్యకమన్నారు.
డిజిటల్ యుగపు సాధనాలు గొప్ప సామర్థ్యాన్ని అందిస్తాయని, అదే సమయంలో మనం జాగ్రత్తగా లేకపోతే, అవి మన వృత్తికి పునాది అయిన నమ్మకం, ప్రామాణికతను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. కోర్టుకు ఏదైనా విషయాన్ని సమర్పించే వ్యక్తి దానిని ప్రామాణిక మూలం నుండి వ్యక్తిగతంగా ధృవీకరించుకోవాలన్నారు. మన వృత్తిపరమైన విశ్వసనీయతను మనం సాఫ్ట్‌వేర్‌కు బదిలీ చేయలేమనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు.
మన విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు క్రిటికల్ థింకింగ్‌ను నేర్పించాలని, తరగతి గదుల్లో AI అవుట్‌పుట్‌ను విమర్శనాత్మకంగా పరిశీలించే పాఠాలు ఉండాలన్నారు. డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆచరణాత్మకంగా ఉపయోగించడంలో వర్ధమాన న్యాయవాదులను సిద్ధం చేయడం ద్వారా మన న్యాయ కళాశాలలు కూడా ఈ ఆధునిక వాస్తవికతకు అనుగుణంగా ఎదగాలన్నారు. 'డీప్‌ఫేక్స్' ఉన్న ఈ యుగంలో, ప్రతి రికార్డింగ్ మరియు ఫైల్ యొక్క ప్రామాణికతను కఠినంగా పరీక్షించడానికి అవసరమైన సాంకేతిక అక్షరాస్యతను మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోసపూరిత సాధనాలు ఎంత అధునాతనంగా మారుతున్నాయో, మన విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందే న్యాయ మేధస్సు అంతకంటే పదునుగా ఉండాలి.
సాంకేతికత మనకు శక్తివంతమైన సాధనాలను అందిస్తుందని, అయితే దానికి ఎప్పటికీ అంతరాత్మ ఉండదన్నారు. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కోర్టు ముందు నిలబడి పౌరుడి రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛను కాపాడే ధైర్యాన్ని అది కూడగట్టలేదనే విషయం మనం గ్రహించాలన్నారు. ఆ పవిత్రమైన, భర్తీ చేయలేని బాధ్యత కేవలం భవిష్యత్ న్యాయ వాదులుగా మీకు మాత్రమే చెందుతుందన్నారు. జస్టిస్ కె. రామస్వామి గారి స్ఫూర్తిదాయక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో భాగంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రో-బోనో క్లబ్( న్యాయ బంధు)ను శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
విశ్వవిద్యాలయం ఖ్యాతి పూర్వవిద్యార్థులు అందిచే సేవలతో ప్రస్పుటం అవుతుందని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. జస్టిస్ కె.రామస్వామి ఏయూ పూర్వవిద్యార్థిగా ఇక్కడ చదువుకుని రాష్ట్ర, దేశ స్థాయిలో అత్యున్నత న్యాయ స్థానాలలో చారిత్రాత్మక తీర్పులను అందించిన న్యాయమూర్తిగా ఎందరికో ఆరద్శంగా నిలచారన్నారు. అత్యంత నిరుపేద వ్యక్తి కోసమే న్యాయస్థానాలు ఉన్నాయని, ఆ చిట్టచివరి వ్యక్తికి న్యాయం అందినప్పుడే చట్టం పరిపూర్ణమవుతుందని జస్టిస్ కె.రామస్వామి బలంగా విశ్వసించేవారని అన్నారు.
శతాబ్ధి ప్రయాణం పూర్తిచేసుకున్నా ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి జస్టిస్ రామస్వామి వంటి న్యాయమూర్తులతో పాటు ఎందరో శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు ప్రజా సేవకులను అందించిందని, వారిలో చాలామంది సాధారణ కుటుంబాల నుండి వచ్చినవారే కావడం గర్వకారణమన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన యువత కోసం విద్య అనే తలుపును తెరవడం, మరియు రాబోయే శతాబ్దం పాటు ఆ తలుపును ఇతరుల కోసం తెరిచే ఉంచేలా వారికి నేర్పించడం మన లక్ష్యం కావాలన్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ కార్యదర్శి, జస్టిస్ రామస్వామి కుమారుడు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనకు తన తండ్రి తరపు స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులందరి తరపున ఇది నిజంగా ఎంతో గర్వకారణమైన క్షణంగా నిలుస్తుందన్నారు. నేడు గౌరవనీయులైన రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఈ ఉపన్యాసం జరగడం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, పూర్వ విద్యార్థులకు, అధ్యాపకులకు మరియు మనందరికీ ఎంతో సముచితమైనది మరియు గొప్ప గౌరవప్రదమైన విషయమన్నారు.
జస్టిస్ కె.రామస్వామి జీవిత ప్రయాణం, విజయాలు, ఆయన అందించిన విలువైన తీర్పులు, మానవతా వాదిగా నిలచిన సందర్భాలను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం సభకు వివరించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పులపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఔట్‌రీచ్ విభాగం డీన్ ఆచార్య కె.రమా సుధ, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, పాలక మండలి సభ్యులు, న్యాయకళాశాల ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులు, నగర ప్రముఖులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయం తరపున గౌరవ శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారిని సత్కరించి విశ్వవిద్యాలయ జ్ఞాపికను బహూకరించి, సత్కరించారు.



0 Comments