విశాఖపట్నం, నవంబర్ 10: ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 సందర్భంగా నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడమే లక్ష్యంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నగర సుందరీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు.

మంగళవారం కమిషనర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లను జీవీఎంసీ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు .ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి విచ్చేసే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి, కేంద్ర ,రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులకు విశాఖ నగరం సరికొత్త అందాలతో స్వాగతం పలికేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సమ్మిట్ నిర్వహణలో తను నోడల్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు చేపట్టిన దృష్ట్యా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని ప్రధాన వేదిక ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు నగరవ్యాప్తంగా బ్రాండింగ్, వేదిక ప్రాంగణంలో ల్యాండ్‌స్కేపింగ్, సివిల్ పనులు, పరిశుభ్రత, నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.సెంటర్ మీడియన్లలో పచ్చదనం.. రహదారులకు కొత్త అందాలు నగరంలోని ప్రధాన రహదారుల సెంటర్ మీడియన్లలో ఆకర్షణీయమైన మొక్కలను నాటుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. మొక్కలను అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దడంతో పాటు మీడియన్లలోని గ్రిల్స్‌కు ఆకర్షణీయమైన రంగులు వేయడం, రహదారుల పక్కన ఉన్న కర్బ్ స్టోన్స్‌కు రంగులు వేయడం, డివైడర్లను సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులను చేపడుతున్నామని వివరించారు.ప్రధాన రహదారులపై అవసరమైన చోట్ల మరమ్మతులు, బీటీ రోడ్డు పనులు చేపడుతూ రహదారులను ప్రయాణానికి అనువుగా అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యమైన కూడళ్లు, జంక్షన్లలో ఫౌంటైన్లు, ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం, ఆధునిక అలంకరణలతో ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.బీచ్ పరిసరాలకు ప్రత్యేక సుందరీకరణవిశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సముద్రతీర ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ తెలిపారు. బీచ్ రోడ్డులో పచ్చదనం పెంపొందించడం, మీడియన్ల అభివృద్ధి, రహదారుల పక్కన పరిశుభ్రత, పెయింటింగ్ పనులతో పాటు బీచ్ పరిసరాల్లోని శిల్పాలు, కళాకృతులకు కొత్త రంగులు వేసి సరికొత్త రూపాన్ని అందిస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నగరమంతటా నిరంతర పారిశుధ్య నిర్వహణసమ్మిట్ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు, బీచ్ పరిసరాలు, పర్యాటక ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్లలో నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. వ్యర్ధాల తొలగింపు తరలింపు , రోడ్ల శుభ్రత, డివైడర్ల పరిశుభ్రత, ప్రజా ప్రదేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.సమ్మిట్ ప్రధాన వేదికతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత, పారిశుధ్య ప్రమాణాలు పాటించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.సమ్మిట్ అనంతరం కూడా నగరానికి శాశ్వత ప్రయోజనంసమ్మిట్ కోసం చేపడుతున్న సుందరీకరణ పనులు కేవలం తాత్కాలిక అలంకరణలకే పరిమితం కాకుండా, నగర ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలో పచ్చదనం పెంపొందించడం, రహదారుల అభివృద్ధి, జంక్షన్ల సుందరీకరణ, బీచ్ పరిసరాల ఆధునికీకరణ, పరిశుభ్రత వంటి కార్యక్రమాల ద్వారా విశాఖ నగరానికి మరింత ప్రత్యేక శోభ తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.సమ్మిట్ ప్రధాన వేదిక అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సీఐఐ ప్రతినిధులు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. వేదికలో మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌స్కేపింగ్, విద్యుత్, అగ్నిమాపక భద్రత, వైద్య సహాయక చర్యలు,పారిశుధ్యం తదితర ఏర్పాట్లు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా విశాఖ నగరానికి మరింత ప్రతిష్ట, గుర్తింపు తీసుకురావడానికి జీవీఎంసీ యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తోందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సమ్మిట్ అనంతరం కూడా నగర సుందరీకరణ, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ విశాఖను మరింత సుందరమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసి.










0 Comments