ప్రశాంతి నిలయం | నవంబర్ 20, 2026 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా, 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ మహాసమ్మేళనం ఈ ఉదయం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైంది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10,000 మంది సేవాదళ్ ప్రతినిధులు తరలివచ్చి, రెండు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక సమావేశంలో పాల్గొంటున్నారు.
ప్రారంభ కార్యక్రమంలో విశిష్ట అతిథులు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జె రత్నాకర్, ట్రస్టీలు శ్రీ కే చక్రవర్తి, శ్రీ ఎస్ ఎస్ నాగానంద్, జస్టిస్ శ్రీ వి రామసుబ్రహ్మణ్యం, శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సమావేశం గురించి వివరిస్తూ శ్రీ చంద్రశేఖరన్ (జాయింట్ నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ – పురుషులు) ప్రతినిధులకు స్వాగతం పలికారు.
A Celebration of Being and Becoming’ (ఉన్న స్థితి నుంచి ఉన్నత దివ్య స్థితికి ప్రయాణం) అనే సమావేశ అంశాన్ని పరిచయం చేస్తూ, ప్రేమ, సేవ, దైవత్వం అనే మూడు ముఖ్యమైన అంశాల గురించి వివరించారు. ఈ సమావేశం కేవలం సంస్థకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, భగవాన్ బోధనలను గుర్తుచేసుకుంటూ, మనలో మార్పు తెచ్చుకుని, సేవాదళ్‌గా మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకునే పవిత్రమైన అవకాశమని అన్నారు. భగవాన్ ఆదర్శాలను మన రోజువారీ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా (AIP, SSSSO) ప్రారంభ ప్రసంగం చేస్తూ, ఈ మహాసమ్మేళనం సాధారణ సమావేశం కాదని, భగవంతుని పట్ల భక్తి, అంకితభావం, శరణాగతిని తెలియజేసే ఆధ్యాత్మిక వేడుక అని అన్నారు. ప్రతి సేవాదళ్ సభ్యుడు, బాలవికాస్ గురువు, విద్యార్థి సమాజానికి మంచి మార్పు తీసుకువచ్చే వెలుగుగా మారాలని ఆకాంక్షించారు.
నిస్వార్థ సేవ గురించి వివరిస్తూ, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు తమ ఉన్నత పదవులను పక్కనపెట్టి సాధారణ సేవలను సైతం ఎంతో ఆనందంగా చేసే సందర్భాలను ఉదాహరించారు. సేవ ఇంటి నుంచే ప్రారంభమై, మన జీవితంలో ఒక భాగంగా మారాలని, అప్పుడప్పుడు చేసే కార్యక్రమంగా మాత్రమే ఉండకూడదని చెప్పారు.
సేవ చేస్తున్నామనే అహంకారానికి దూరంగా ఉండాలని సూచిస్తూ, స్వామి సేవను తామే చేస్తున్నామని ఎవరూ భావించకూడదని, ప్రతి ఒక్కరూ భగవంతుని చేతిలో ఒక సాధనం మాత్రమేనని గుర్తుచేశారు. సేవకు నిజమైన ప్రతిఫలం ప్రశంసలు, పురస్కారాలు కాదని, నిస్వార్థ సేవ ద్వారా మనకు లభించే మనశ్శాంతి, ప్రేమ, ఆనందమేనని తెలిపారు.ముఖ్య ఉపన్యాసకులుగా పాల్గొన్న గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ వి. రామసుబ్రహ్మణ్యం (శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) భగవాన్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునే జ్ఞాపకాలతో పంచుకున్నారు.
ఒక విశేషమైన విషయాన్ని గుర్తుచేస్తూ, సరిగ్గా 56 సంవత్సరాల క్రితం, 1970 నవంబర్ 20న, తన తండ్రి ఇదే దివ్య సన్నిధిలో 4వ అఖిల భారత సమావేశంలో సబ్‌కమిటీ నివేదికను సమర్పించారని తెలిపారు. తన తల్లిదండ్రులు 1969లో మద్రాసులో సేవాదళ్ తొలి బృందంలో సభ్యులుగా భగవాన్ చేత స్వయంగా సేవాదళ్‌లో ప్రవేశపెట్టబడ్డారని వివరించారు. ఆ తొలి రోజులలో జరిగిన అనేక సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భగవాన్ తన తల్లిదండ్రులకు స్వయంగా సేవాదళ్ బ్యాడ్జిలను అందించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
హనుమంతుడు, శ్రీకృష్ణుడు, పద్మపాదుల జీవితాలను ఉదాహరిస్తూ, భగవంతునికి, గురువుకు వినయంతో చేసే సేవ ఆధ్యాత్మికంగా ఎదగడానికి గొప్ప మార్గమని వివరించారు. నారదుడు నిరంతరం శ్రీరామ నామాన్ని జపించగా, హనుమంతుడు శ్రీరాముని పట్ల తన భక్తిని సేవ ద్వారా చాటుకున్నారని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉన్న నాలుగు దశలు — సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం — గురించి వివరిస్తూ, చివరి దశలో భగవంతునితో సంపూర్ణ ఐక్యత సాధించడమే ఆధ్యాత్మిక ప్రయాణ పరమావధి అని తెలిపారు.
తన ప్రసంగం ముగింపులో, *సేవాదళ్‌గా ఉండటంలోని నిజమైన గొప్పతనం ఏ హోదాలోనో, ఏ స్థానంలోనో లేదని; వినయం, శరణాగతి, ప్రేమతో చేసే సేవలోనే అసలైన గొప్పతనం ఉందని ఉద్ఘాటించారు*.
ఈ ఉదయం కార్యక్రమాలు సేవాదళ్ సభ్యులందరిలో ఆత్మపరిశీలన, సేవా సంకల్పం, ఆధ్యాత్మిక ఉన్నతికి స్ఫూర్తినిస్తూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమను సేవ ద్వారా వ్యక్తపరచాలి, సేవ ద్వారా దైవత్వాన్ని అనుభవించాలి అనే శాశ్వత సందేశాన్ని మరోసారి గుర్తుచేశాయి.










0 Comments