విశాఖ పరిశుభ్రత, సుందరీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు! * స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రథమ స్థానం సాధించిన విశాఖకు అభినందనలు. * ప్రపంచ దేశాలకు పరిశుభ్రత, పర్యావరణహిత నగరంగా విశాఖ ఆదర్శంగా నిలవాలి. * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రత్యేక ప్రశంసా పురస్కారం అందజేసిన ముఖ్యమంత్రి. * సీఐఐ సమ్మిట్ విజయవంతానికి కృషిచేసిన 252 మంది అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు ప్రశంసలు, అవార్డులు


విశాఖపట్నం, నవంబర్ 13:విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 విజయవంతం కావడంతో పాటు, నగరాన్ని అత్యంత పరిశుభ్రంగా, సుందరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో జీవీఎంసీ యంత్రాంగం కనబరిచిన సమష్టి కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రథమ పరిశుభ్ర నగరంగా విశాఖ నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రత్యేక ప్రశంసా పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విశాఖ నగరాన్ని కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సుందరీకరణలో ఆదర్శంగా నిలపాలని, నిత్య పరిశుభ్రతను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని కమిషనర్‌కు సూచించారు.

*సీఐఐ సమ్మిట్ విజయవంతంలో విశాఖ ప్రత్యేక ఆకర్షణ**

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ద్వారా సుమారు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అంగీకారాలు కుదరడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, హస్తకళలను ప్రతిబింబించే ప్రదర్శనలు, ఎంఎస్ఎంఈ పార్క్, వివిధ పారిశ్రామిక ఎగ్జిబిషన్లు దేశ, విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. విశాఖ నగరంలోని ప్రకృతి అందాలు, పచ్చదనం, పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించడం నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందన్నారు. ఈ ఏర్పాట్లలో కృషిచేసిన జిల్లా అధికార యంత్రాంగం, సీఐఐ ప్రతినిధులను అభినందించారు.

జీవీఎంసీ యంత్రాంగం సమష్టి కృషికి గుర్తింపు*ఇటీవల అర్నాబ్, మురుసు తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో జీవీఎంసీ యంత్రాంగం చూపిన అంకితభావాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ ప్రథమ స్థానం సాధించడంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలతో పాటు ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నగర పరిశుభ్రతలో వారి సేవలు ఎంతో విలువైనవని కొనియాడి పలువురు పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువులతో ముఖ్యమంత్రి సన్మానించి అభినందించారు.

సీఐఐ సమ్మిట్ విజయవంతానికి కృషిచేసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్, వివిధ శాఖల ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులు సహా 252 మందిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను, ఉద్యోగులను, పారిశుధ్య కార్మికులను దుశ్శాలువాలతో సత్కరించి అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విశాఖ నగరం సాధించిన జాతీయ స్థాయి పరిశుభ్రత పురస్కారం మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల భాగస్వామ్యంతో నిత్య పరిశుభ్రతను కొనసాగిస్తూ పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణకు మరింత ప్రాధాన్యతనిస్తూ విశాఖను ప్రపంచ స్థాయి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ సందర్భంగా తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో దేశంలోనే విశాఖ నగరం మొదటిసారిగా ప్రధమ స్థానం పొందుటకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, జీవీఎంసీ యంత్రాంగం, విశాఖ నగర ప్రజలు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు సహకారం మరువలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కమిషనర్ తెలియజేశారు


పౌర సంబంధాల అధికారి, 

జీవీఎంసీ

Post a Comment

0 Comments