జ్ఞానాపురం: పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం వికసిస్తుందని సెయింట్ జోసఫ్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కళాశాలలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలవుతూ మానసిక, శారీరక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, కవితా పఠనం తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల గ్రంథాలయాధికారి స్వరాజ్యలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది, కళాశాల పీఆర్వో డా. పి.కె. జయలక్ష్మి పాల్గొన్నారు.
పుస్తక ప్రదర్శనను అధ్యాపకులు, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.


0 Comments