జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,


విశాఖపట్నం :న్యూమోనియా నిర్మూలనకు SAANS కార్యక్రమం పిల్లలలో న్యూమోనియా వ్యాధి నివారణ, తొలిదశలో గుర్తింపు మరియు సమయానుకూల చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో, SAANS (Social Awareness and Action to Neutralize Pneumonia Successfully) అనే జాతీయ కార్యక్రమాన్ని 2026 నవంబర్ 12 నుండి 2027 ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. పి. జగదీశ్వరరావు గారు తెలిపారు.

న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ అని, ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాణాంతకమై ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలలో సుమారు 16% న్యూమోనియా కారణంగానే జరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు.

తదుపరి డా.బి.లూసీ కార్డీలియా, జిల్లా వ్యాధి నిరోధక మరియు ఇమ్యూనైజేషన్ అధికారిణి మాట్లాడుతూ,

“ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో న్యూమోనియా లక్షణాలు, జాగ్రత్తలు, మరియు సమయానికి వైద్యసేవలు పొందడం గురించి విస్తృత అవగాహన కల్పించబడుతుంది. అలాగే ఆరోగ్య సిబ్బందికి శిక్షణల ఆధారంగా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. Pneumococcal Conjugate Vaccine (PCV) టీకా పిల్లల రక్షణలో కీలకమని” వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆశా, ఎఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

చిన్నారుల్లో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తల్లిదండ్రులను కోరారు. “న్యుమోనియా నివారణ బాల్యానికి భరోసా” అని డా. పి . జగదీశ్వరరావు గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, శ్రీ వరప్రసాద్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి, డా.సమత,   డా.కళ్యాణి, డా.శాంతి, డా.ప్రదీప్,  డా.పద్మజ, డా.బాలాజీ, శ్రీమతి సయ్యద్ బేగం, శ్రీ జి.శ్రీనివాసరావు, శ్రీ శశి భూషణ్ మరియు శ్రీ బి.నాగభూషణరావు సహాయ మలేరియా అధికారి వారు, తదితరులు పాల్గొన్నారు.




      జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, 

               విశాఖపట్నం

Post a Comment

0 Comments