ప్రశాంతి నిలయం, నవంబర్ 17, 2026: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహంతో, భగవాన్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందేశాన్ని చాటుతూ సాగిన ఐదు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథాల యాత్ర మంగళవారం సాయంత్రం ప్రశాంతి నిలయానికి చేరుకోవడంతో ఘనంగా ముగిసింది.
ప్రేమ, సేవ, నిస్వార్థ జీవనం అనే భగవాన్ అమూల్య సందేశాన్ని ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పర్యటించిన ఈ రథాలు, వేలాది కుటుంబాల గృహాలను సందర్శించి భక్తులకు భగవాన్ దివ్య సాన్నిధ్యాన్ని అనుభూతి కలిగించాయి. తమ ఇళ్లకు రథాలను ఆహ్వానించిన అనేకమంది భక్తులు స్వయంగా భగవాన్ తమ ఇంటికి విచ్చేసిన అనుభూతిని పొందారు.
ఈ పవిత్ర యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం ఐదు రథాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అవతార కార్యానికి తొలి అంకురార్పణ జరిగిన చారిత్రాత్మక పట్టణం ఉరవకొండకు చేరుకున్నాయి. దశాబ్దాల క్రితం భగవాన్ తన దివ్య సందేశమైన “మనసా భజరే గురు చరణం” అంటూ అవతార కార్యాన్ని ప్రపంచానికి చాటిన ఈ పవిత్ర ప్రదేశంలో భక్తి, ఆధ్యాత్మికత, భగవాన్ స్మృతులు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు తొలుత కరిబసవ స్వామి పాఠశాలలో భగవాన్ బాల్యంలో విద్యనభ్యసించిన తరగతి గదిని సందర్శించి వినమ్రంగా నివాళులర్పించారు. అనంతరం ఉరవకొండ పట్టణ వీధుల గుండా నిర్వహించిన పవిత్ర నగర సంకీర్తనలో భక్తులు, సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవాన్ నామస్మరణతో పట్టణాన్ని భక్తిరసంతో నింపారు.
అనంతరం పాఠశాల మైదానంలో ఐదు రథాలు కొలువుదీరగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో రథాలకు స్వాగతం పలికి తమ ప్రణామాలు సమర్పించారు. స్థానిక మందిరంలో భగవాన్ అవతార కార్యం ప్రారంభమైన నాటి మధుర స్మృతులను భక్తులు స్మరించుకున్నారు. భగవాన్ దశాబ్దాల క్రితం స్వయంగా “మనసా భజరే” ఆలపించిన పవిత్ర శిల వద్ద అదే భజనను ఆలపించడం ఈ కార్యక్రమంలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలిచింది. భగవాన్ దివ్య మిషన్లో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన పాదపద్మాల చెంత సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు భక్తులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పించారు.
అనంతరం ఐదు ప్రేమ ప్రవాహిణి రథాలకు ఘనంగా జెండా ఊపి ప్రశాంతి నిలయం వైపు సాగనంపారు. దేశవ్యాప్తంగా సాగిన సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్రకు తుది అంకంగా మంగళవారం సాయంత్రం ఐదు రథాలు ప్రశాంతి నిలయానికి చేరుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్, శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు, శ్రీమతి హిమవాహిని రత్నాకర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఇతర సీనియర్ పదాధికారులు ఐదు ప్రేమ ప్రవాహిణి రథాలకు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో రథాలకు స్వాగతం పలికి తమ ప్రణామాలు సమర్పించారు.
భగవాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రేమ, సేవ, భక్తి, మానవతా విలువలను చాటిన ఈ ప్రేమ ప్రవాహిణి రథయాత్ర భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది.





0 Comments