సింహాద్రి నాథుడి పాదాల చెంత దీపావళి వెలుగులు* *కొండ దిగువున తొలిపావంచ వద్ద దీపాలు వెలిగించి వేడుకలు*


సింహాచలం, నవంబర్ 8:ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో దీపావళి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. సింహాచల కొండ దిగువున ఉన్న తొలిపావంచ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సింహాద్రి నాథుడి పాదాల చెంత వెలిగించిన దీపాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, డాక్‌యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తొలిపావంచ వద్ద దీపాలు వెలిగించి సింహాద్రి నాథుడికి నమస్కరించుకున్నారు. లోకమంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను తొలగించి వెలుగులు నింపాలని, సమాజంలో సౌభాగ్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సర్వమానవాళికి మేలు కలగాలని సింహాద్రి నాథుడిని వేడుకున్నారు.

Post a Comment

0 Comments