*విశాఖపట్నం:** నెలలు నిండకుండా జన్మించిన శిశువుల ఆరోగ్యం, సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే వేడుకలను ఆదివారం సాయంత్రం వీఎంఆర్డీఏ (వుడా) చిల్డ్రన్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. నియోనాటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారని తెలిపారు. 37 వారాల కంటే ముందుగా జన్మించిన శిశువులను ప్రీమెచ్యూర్ బేబీస్గా పరిగణిస్తారని, 28 వారాల లోపు జన్మించిన వారిని ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీస్గా గుర్తిస్తారని వివరించారు.
నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూరో డెవలప్మెంట్ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తక్కువ గర్భధారణ వారాల్లో జన్మించిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమని చెప్పారు.
ఇలాంటి శిశువులకు పుట్టిన వెంటనే తగిన వైద్య సేవలు అందించడంతోపాటు తల్లి పాలను అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అవసరాన్ని బట్టి ఎన్ఐసీయూలో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్ ద్వారా ప్రత్యేక చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు.
తాను ఇప్పటివరకు సుమారు 9,000 మంది ప్రీమెచ్యూర్ శిశువులకు వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని, సరైన సమయంలో సరైన ఆసుపత్రికి చేరుకుని, తగిన వైద్యం అందిస్తే నెలలు నిండకుండా జన్మించిన శిశువులను కూడా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రీమెచ్యూర్ ప్రసవం జరిగే అవకాశం ఉన్న గర్భిణులు ముందుగానే అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు గరుడ రామ, విద్యారమ, గీతవందన, రాధిక, కేటీవీ లక్ష్మణ్, విజయ్, మౌనిక, స్రవంతి, ప్రియాంక, భూలక్ష్మి, అనితా త్రిపాఠి, రామాదేవితో పాటు సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రీమెచ్యూర్ శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.


0 Comments