ఆంధ్రవిశ్వవిద్యాలయం, నవంబర్ 17:ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కెన్యా రాయబార కార్యాలయ ప్రతినిధి బృందం ఈ రోజు సందర్శించింది. భారత్–కెన్యా విద్యా సహకారం, కెన్యా విద్యార్థుల సంక్షేమం మరియు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఉన్నత విద్య మరియు పరిశోధనా రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కెన్యా రాయబార కార్యాలయ ప్రతినిధి బృందం మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో పాలక మండలి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కెన్యా విద్యార్థుల విద్యా పురోగతి, పూర్వ విద్యార్థుల అనుసంధానం మరియు ఇరు దేశాల విద్యా సంస్థల మధ్య అవగాహన ఒప్పందాల పై చర్చించారు. సదస్సులో కెన్యా ప్రతినిధులు రేచల్ న్గేటిచ్ – ఎడ్యుకేషన్ కౌన్సిలర్, క్రిస్టీన్ ముయా – ట్రేడ్ కౌన్సిలర్, ఆన్ కాసిచానా – ఫస్ట్ సెక్రటరీ, క్రిస్ ఒటోము – ఇమ్మిగ్రేషన్ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ కెన్యా దేశం నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఏయూలో విద్యను అభ్యశించడానికి రావడం జరుగుతోందన్నారు. గతంలో ఏయూలో చదువుకుని కెన్యాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో అనుసంధానం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కెన్యా విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏయూలో 58 దేశాలకు చెందిన 1200 మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో సైతం కెన్యా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
కెన్యా ప్రతినిధి రేచల్ న్గేటిచ్ మాట్లాడుతూ ఏయూ అందించే మేధో సహకారం ఎంతో కీలకమన్నారు. తమ దేశ విద్యార్థులు ఏయూలో సంతోషంగా విద్యను పొందుతున్నారన్నారు. ఐసిసిఆర్ అందిస్తున్న సహకారంతో నాణ్యమైన ఉన్నత విద్య కెన్యా విద్యార్థులకు లభిస్తోందన్నారు. భారత్‌లో చదువుకున్న కెన్యా విద్యార్థులు విభిన్న ఉన్నత పదువులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ శతాబ్ధి ప్రయాణం ఎంతో చారిత్రాత్మకమని, ఇక్కడ ఉన్న ఆచార్యుల మేధస్సు, జ్ఞానం ఎంతో కీలకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో విభిన్న రంగాలలో కలసి పనిచేద్దామని, కెన్యా విశ్వవిద్యాలను సైతం అనుసంధానం చేసే దిశగా పనిచేస్తామన్నారు.
అనంతరం ఏయూ తరపున కెన్యా ప్రతినిధి బృందాన్ని సత్కరించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పులిపాటి. కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ఆచార్య ఎస్. పాల్ డగ్లస్, పలువురు డీన్‌లు, ఆచార్యులు పాల్గొన్నారు.


0 Comments