అమరావతి:* ఆక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంభవించిన తుపాన్ల సమయంలో ఎదురైన పరిస్థితులు, విద్యుత్ పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేలకూలినా, తీగలు తెగిపడినా వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇందుకోసం అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని, తుపాను సమయంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెగిపడిన విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు ఉంటే వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. సరఫరా నిలిచిన ప్రాంతాలు, పునరుద్ధరణకు పట్టే సమయం తదితర వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు.
(Peela Satyanarayana Srinivas)

0 Comments