విశాఖపట్నం, నవంబర్ 16:సమాజాభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ, ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగామని పేర్కొంటూ, దశాబ్దాలు గడుస్తున్నా జర్నలిస్టుల సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిరంతరం విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల భద్రత బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అనేకమంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ గంట్ల శ్రీనుబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ విభాగం అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి కె. శ్రీనివాస్‌తో పాటు వివిధ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.



0 Comments