అమలాపురం, విశాఖ సందేశం...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ను బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ప్రతినిధి బృందం, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు, రాష్ట్ర ఇన్చార్జి సురేష్ ఆర్య , రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ , రాష్ట్ర కోఆర్డినేటర్లు వందన కుమార్, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ లు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీఎస్పీ నాయకులు, అభ్యర్థులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు సృష్టించడం వంటి అనేక సంఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీఎస్పీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని, కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, మరికొన్ని ప్రాంతాల్లో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరిపి తీవ్రంగా గాయపరిచారని వివరించడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనే హక్కును అడ్డుకోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక ప్రలోభాలకు, అడ్డంకులకు పాల్పడినప్పటికీ, బహుజన్ సమాజ్ పార్టీ తన సిద్ధాంతాలకు కట్టుబడి పోరాటం కొనసాగిస్తూ నాలుగు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిందని తెలిపారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నాలకు భవిష్యత్తులో ప్రజలే తగిన సమాధానం చెబుతారని, రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రజాక్షేత్రంలో మరింత బలంగా ఎదిగి, టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా తగిన బుద్ధి చెబుతుందని బందెల గౌతమ్ కుమార్ స్పష్టం చేశారు.

0 Comments