విశాఖపట్నం :డాబాగార్డెన్స్.., నవంబర్ 20:సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, దాని పరిరక్షణ, ఆచరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ యాజ్ఞవల్క్యరాజాశ్రమ పీఠాధిపతులు, అభినవ వివేకానంద పూజ్యశ్రీ శ్రీశ్రీ డాక్టర్ కృష్ణచరణానందభారతీ స్వామివారు ఉద్బోధించారు. ధర్మాన్ని కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం చేయకుండా, నిత్యజీవితంలో సత్యం, ధర్మం, దయ, కరుణ, సేవాభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవన విధానమే వ్యక్తికి మానసిక ప్రశాంతతను, సమాజానికి శాంతి సౌభాగ్యాలను అందిస్తుందని ఆశీర్వచనం చేశారు.
కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ నగర ప్రజలకు కార్తీక మాస శుభ సందేశాన్ని అందించారు. డాబాగార్డెన్స్‌లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సత్సంగం, ఆశీర్వచన కార్యక్రమంలో స్వామివారు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో విశిష్టమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిగిన పవిత్ర భూమి అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సనాతన ధర్మ సంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మానవాళికి జీవన మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని వివరించారు. సనాతన ధర్మం అంటే ఒక మతానికి సంబంధించిన ఆచారాలు మాత్రమే కాదని, సమస్త మానవాళి శ్రేయస్సును, జీవుల పట్ల ప్రేమను, ప్రకృతి పట్ల గౌరవాన్ని, సర్వమానవ సమానత్వాన్ని బోధించే గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు.
ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనిషిలో మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన పెంపొందుతాయని, కుటుంబ వ్యవస్థలో ప్రేమాభిమానాలు, సమాజంలో సోదరభావం బలపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు సనాతన ధర్మ విలువలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు, దైవచింతనకు, దీపారాధనకు విశేషమైన మాసమని పేర్కొన్నారు. అయితే ఒక్క కార్తీక మాసమే కాకుండా ప్రతి మాసానికి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉందని వివరించారు.
ప్రస్తుత అపార్ట్మెంట్ జీవన విధానంలో పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతున్నా తెలియని పరిస్థితి నెలకొందని, మానవ సంబంధాలు, పరస్పర ఆప్యాయతలు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక అభివృద్ధితో పాటు మానవీయ విలువలు కూడా పెంపొందించుకోవాలని సూచించారు. విశాఖపట్నం శాంతికి మారుపేరైన నగరమని, అన్ని ప్రాంతాల ప్రజలను ఆదరించే గొప్ప సంస్కృతి ఈ నగరానికి ఉందని కొనియాడారు.
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ 1936 నుంచి 110 దేశాల్లో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం అభినందనీయమని స్వామివారు పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక విలువలను అందిస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వ భావనలను పెంపొందించేందుకు సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు. తాను గాడ్ లివ్డ్ స్టూడియోలో ప్రసంగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కార్య క్రమ నిర్వహకురాలు
బీకే రామేశ్వరి మాట్లాడుతూ కార్తీక మాసంలో దేశంలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయని తెలిపారు. స్వామివారు విశాఖకు విచ్చేసి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించడం శుభపరిణామమని, సనాతన ధర్మ పరిరక్షణ నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అభినవ వివేకానందగా ఖ్యాతిగాంచిన స్వామివారి బోధనలు సమాజానికి మార్గదర్శకమని అన్నారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రపంచము లో ప్రజల కోసం. స్వామి.శాంతి సందేశాన్ని అందించడం అభినందనీయమన్నారు. విశాఖ నగరం అన్ని ప్రాంతాల ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరిస్తుందని, శాంతికాముక నగరంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
బ్రహ్మ కుమారి బీకే సత్యవతి మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని, పరిశుద్ధమైన ఆలోచనలు, పవిత్రమైన మనసుతో జీవిస్తూ మంచి కార్యాలు చేపట్టాలని సూచించారు.
మీడియా పాత్ర కీలకం
సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని స్వామివారు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, మంచి ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లాలంటే మీడియా సహకారం అవసరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా బలంగా ఉండాలని, జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ.. సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ స్వామివారు విశాఖ కు విచ్చేసి కార్తీక మాస ఆధ్యాత్మిక సందేశాన్ని అందించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం, ధర్మాచరణ, పరస్పర ప్రేమాభిమానాలతో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామిని దీక్షిత నంద భారతి మాతాజీ తదితరులు పాల్గొన్నారు..



0 Comments