శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. * రాచరికంలో పుట్టి.. సామ్యవాద భావజాలంతో ప్రజాసేవ చేసిన మహాదాతపి.వి.జి. రాజు సేవలు చిరస్మరణీయం: ఈవో జల్లేపల్లి వెంకట్రావు


సింహాచలం:నవంబరు 14: సింహాచల దేవస్థానం మాజీ అనువంశిక ధర్మకర్త డాక్టర్ పూసపాటి విజయరామ గజపతి రాజు (పి.వి.జి. రాజు) 31వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం దేవస్థానం గోశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. రాజవంశంలో జన్మించినప్పటికీ సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది పి.వి.జి. రాజు అని కొనియాడారు. రాచరికపు నేపథ్యం ఉన్నా సామ్యవాద భావజాలాన్ని ఆచరిస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు.

విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగించిన మహాదాతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. సింహాచల దేవస్థానం అభివృద్ధికి, పూర్వ వైభవానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. స్వామివారిపై ఆయనకున్న అపారమైన భక్తి, ఆలయ అభివృద్ధిపై చూపిన అంకితభావం ఎప్పటికీ స్మరణీయమని చెప్పారు. మానవత్వం, సేవాభావానికి ప్రతిరూపంగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.

కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్‌చార్జి డి.వి.ఎస్.ఆర్. రామరాజు, పూర్వపు పర్యవేక్షణ అధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్, సిబ్బంది సాయి, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments