స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖకు జాతీయ ప్రథమ స్థానం.. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం! * విశాఖ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ సుందర, పరిశుభ్రమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలవాలి. * స్వచ్ఛ సర్వేక్షణ 2025-26లో విశాఖపట్నం సాధించిన జాతీయ ప్రథమ స్థానం అవార్డును తిలకించి సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి. * నగరాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని సూచన. * దేశ విదేశాలకు విశాఖ నగరం సుందర నగరంగా దిక్సూచిగా నిలవాలని ఆకాంక్ష

 


విశాఖపట్నం, నవంబర్ 12: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖపట్నం నగరం దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హర్షం, సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి లభించిన ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గురువారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వివరించారు.

ఈ సందర్భంగా విశాఖ నగరం పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రథమ స్థానాన్ని సాధించిన విషయాన్ని, అందుకు సంబంధించిన అవార్డును ముఖ్యమంత్రి తిలకించారు. నగరానికి లభించిన ఈ అరుదైన జాతీయ గుర్తింపు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, జీవీఎంసీ చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, నగర పరిశుభ్రత నిర్వహణను అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విశాఖపట్నం నగరం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ సుందరమైన, పరిశుభ్రమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రకృతి అందాలు, సముద్ర తీరం, పచ్చదనం, పర్యాటక ప్రాధాన్యత కలిగిన విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సూచించారు. దేశ విదేశాలకు విశాఖపట్నం ఒక ఆదర్శ నగరంగా, సుందర నగరాల అభివృద్ధికి దిక్సూచిగా నిలిచేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, రహదారుల పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడం, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు నిరంతరం ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో సాధించిన ప్రథమ స్థానాన్ని కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో విశాఖను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

విశాఖపట్నం నగరానికి దేశంలోనే ప్రథమ స్థానం సాధించి పెట్టడంలో కృషి చేసిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణను, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో నగర అభివృద్ధి, సుందరీకరణ, పారిశుధ్య నిర్వహణలో మరింత బాధ్యతతో పనిచేయాలని వారికి సూచించారు.

విశాఖపట్నం నగరానికి లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, జీవీఎంసీ సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ విశాఖను పరిశుభ్రత, సుందరీకరణ, సుస్థిర పట్టణాభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Post a Comment

0 Comments