విశాఖపట్నం, నవంబర్ 12: సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తద్వారా యువతతో పాటు మహిళలకు కూడా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, 2027 మార్చి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
గురువారం విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు విచ్చేసిన మంత్రి డాక్టర్ పి. నారాయణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ముడసర్లోవలో నిర్మాణంలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖపట్నం పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చే మహిళా ఉద్యోగులకు అవసరమైన వసతి సదుపాయాలను ముందుగానే కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు భద్రతతో కూడిన నాణ్యమైన వసతి కల్పించాలనే లక్ష్యంతో గాజువాక, మధురవాడ, ముడసర్లోవ ప్రాంతాల్లో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు.
ముడసర్లోవలో హాస్టల్ నిర్మాణ పనులు ఆశించిన వేగంతో జరగకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న కార్మికులకు అదనంగా మరింత మంది కార్మికులను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించారు. నిర్ణీత గడువులోగా అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణాన్ని పూర్తి చేసి 2027 మార్చి నాటికి మహిళా ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల పనులను కూడా వేగవంతం చేసి అదే గడువులోగా పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజు, విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు, పర్యవేక్షక ఇంజనీర్ దిలీప్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ






0 Comments