ఆటిజం చిన్నారుల‌ను ప్రాధ‌మిక ద‌శ‌లో గుర్తించాలి


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, న‌వంబ‌ర్ 20:ఆటిజం స‌మ‌స్య పెరుగుతోంద‌ని, ఈ వ్యాధిక‌లిగిన చిన్నారుల‌ను ప్రాధ‌మిక స్థాయిలో గుర్తించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఏయూ విద్య విభాగం,  రీహేబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స‌హ‌కారంతో నిర్వ‌హిస్తున్న మూడు రోజుల సి.ఆర్.ఇ కార్య‌క్ర‌మం ఈ రోజు ఏయూ ప్లాటినం జూబ్లీ స‌మావేశ మందిరంలో ప్రారంభ‌మైంది.  ఎర్లీ ఐడింటిఫికేష‌న్ అండ్ మ‌ల్టీ డిసిప్లీన‌రీ ఇంట‌ర్‌వెన్ష‌న్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ విత్ ఆటిజం స్పెక్ట్ర‌మ్ డిజార్ట‌ర్స్ అంశంపై ఈ మూడురోజుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ముఖ్య అతిధి నేష‌న‌ల్ ఆర్‌.సి.ఐ స‌భ్యురాలు శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం విద్య విభాగాధిప‌తి ఆచార్య టి.జి అముత వ‌ల్లి వ‌ర్చువ‌ల్ విధానంలో స‌ద‌స్సులో పాల్గొని మాట్లాడుతూ ఆటిజం స‌మ‌స్య పెరుగుతోంద‌ని, దీనిని ప్రాధ‌మిక ద‌శ‌లో గుర్తించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. ఈ దిశ‌గా నిపుణుల‌ను త‌యారు చేసే విధంగా ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.


ఆర్ట్స్‌కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది ర‌వి మాట్లాడుతూ  ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ విషయంలో, వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావడం, సమాజ స్థాయిలో అవగాహన లోపించడం, సమన్వయ లోపంతో కూడిన సంరక్షణ వంటివి మనం అధిగమించాల్సిన కీలక సవాళ్లుగా ఉన్నాయన్నారు. ఆటిజం పిల్లలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ  సమస్యలను గుర్తించడానికి, ఆచరణాత్మకమైన, ఆధారాలతో కూడిన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక అవసరమ‌న్నారు. విద్యావేత్తలు,రీహాబిలిటేష‌న్‌ నిపుణులు, కాబోయే ఉపాధ్యాయులు ఈ పిల్లలకు సమర్థవంతంగా చేరువవ్వాలంటే, వారి పూర్తి సామాజిక వాతావరణాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి యొక్క సామాజిక నేపథ్యంతో పాటు, వారి మానసిక, భావోద్వేగ స్థితిగతులను మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, సామాజిక బాధ్యత, కరుణ, గౌరవం, ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు.

స‌ద‌స్సు క‌న్వీన‌ర్ ఆచార్య టి.షారోన్ రాజు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో ఎలా వ్యవహరించాలి, ఎలా అవగాహన కల్పించాలి అనే అంశంపై ప్ర‌సంగించ‌డానికి ప్రముఖ‌ రిసోర్స్ పర్సన్‌లను ఆహ్వానించామ‌న్నారు.  కేవలం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకే కాకుండా, వారి భవిష్యత్తు కెరీర్, సుస్థిర అభివృద్ధి కోసం తల్లిదండ్రులకు, సమాజంలోని ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఆంధ్ర‌మెడిక‌ల్ క‌ళాశాల ఆచార్యులు ఎన్‌.ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ అంత‌ర్జాతీయ గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తీ 31 మందిలో ఒక‌రికి ఆటిజం స‌మ‌స్య ఉంద‌న్నారు. కొన్ని న‌గ‌రాల‌లో ప్ర‌తీ 20 మందిలో ఒక‌రు ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. ఆటిజం చిన్నారుల‌ శ్రేయ‌స్సు, సంక్షేమం త‌ల్లిదండ్రుల‌కు చాలా భారంగా మారుతోంద‌న్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో త‌ల్లిదండ్రులు తీవ్ర మాన‌సిక వేద‌న‌కు, డిప్రెష‌న్‌కు గుర‌వుతున్నార‌న్నారు. వ్యాధి తీవ్ర‌త‌ను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం, ముంద‌స్తు గుర్తింపు వంటివి ఎంతో కీల‌కంగా నిలుస్తున్నాయ‌న్నారు.

స‌దస్సులో భాగంగా ఆటిజం ఎక్రాస్ ద లైఫ్‌స్పాన్ పుస్త‌కాన్ని అతిధులు చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. సద‌స్సులో స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ నిపుణులు డాక్ట‌ర్ కూన ల‌లిత‌, డాక్ట‌ర్ బి.అనుప‌మ దేవి, డాక్ట‌ర్ ఎన్‌.సీత‌రామ క్రిష్ణ‌, డాక్ట‌ర్ పి.ఉషా దేవి, డాక్ట‌ర్ పి.నాయుడు త‌దిత‌రులు ప్ర‌సంగించారు.


విభాగ ఆచార్యులు, వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులు, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అతిధుల‌ను స‌త్క‌రించారు.

Post a Comment

0 Comments