అమలాపురం, విశాఖ సందేశం...అమలాపురం కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (కిమ్స్) వైద్య కళాశాలలో, నవంబర్ 18 నుండి 24వ తేదీ వరకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) అవగాహనా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. "వన్ హెల్త్, వన్ యాక్షన్ : యాంటీమైక్రోబియల్ రెసిస్టన్స్ ను నివారించండి" అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం యాంటీమైక్రోబియల్ మందులపై పెరుగుతున్న నిరోధకత (Antimicrobial Resistance) పట్ల వైద్య సిబ్బందికి, విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం, యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించేలా ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కిమ్స్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ ఆనంద్ ఆచార్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైక్రోబయాలజీ విభాగాధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. పద్మజ, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ డెబోరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా . ఆనంద్ ఆచార్య మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు మాత్రమే యాంటీ బయోటిక్ మందులను వినియోగించాలని, ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్దతులను పాటించాలని, మన ఇంటినే కాకుండా పరిసర ప్రాంతాలను, పెంపుడు జంతువులను, వ్యవసాయ పద్దతులను మరియు జల వనరులను కూడా పరిశుభ్రంగా ఉంచాలనే అంశాలపై ప్రజలందరికి అవగాహన కల్పించడం వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతని, దీని ద్వారా మన ఈ తరాన్ని మరియు భావి తరాలను కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టన్స్ ద్వారా వచ్చే సమస్యలనుండి కాపాడగలమని తెలిపారు.
ఈ వారోత్సవాల్లో భాగంగా ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (IPC), చేతుల పరిశుభ్రత (Hand Hygiene), బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ (BMW Management), యాంటీబయాటిక్స్ వినియోగం మరియు వాటి దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా పోస్టర్లను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథి మరియు కార్యక్రమ నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన మేరకే ఉపయోగించడం, అవసరం లేనప్పుడు వాటిని వినియోగించకపోవడం, ఇన్ఫెక్షన్ల నివారణకు చేతుల పరిశుభ్రత పాటించడం, ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌ను నియంత్రించవచ్చని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నియంత్రణలో ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తుచేస్తూ, సురక్షితమైన వైద్య సేవలు మరియు సమర్థవంతమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులపై కిమ్స్ ఆసుపత్రి తన నిబద్ధతను చాటుకుంది. ఇటువంటి సమాజ ఆరోగ్యానికి ఉపయోగపడే అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కిమ్స్ వైద్య బృందాన్ని కిమ్స్ చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ రాజు, మరియు ఎం.డి. కె. రవి వర్మ అభినందించారు.



0 Comments