విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-మానవతా విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు శ్రీ సత్య సాయి విద్యా విహార్, విశాఖపట్నం విద్యార్థులు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ సత్య సాయి సేవా సంస్థల స్కూలు కన్వీనర్, యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ప్రేరణతో, విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో స్వయంగా మట్టితో పర్యావరణహిత గణేశ విగ్రహాలను తయారు చేశారు.
తాము ఎంతో ప్రేమతో తయారు చేసిన ఈ మట్టి వినాయక విగ్రహాలను ఈ రోజు ఎం.వి.పి. కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు బహుకరించేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు. అయితే కార్యక్రమం సమయంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, చిన్నారులు తమ సేవా సంకల్పాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. గొడుగుల రక్షణలో, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో, వారు ఇంటింటికీ వెళ్లి మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు భక్తి, ప్రేమతో అందించారు.
భారీ వర్షంలోనూ చిరునవ్వులు చిందిస్తూ, తాము స్వయంగా తయారు చేసిన గణేశ విగ్రహాలను ప్రజలకు అందించిన చిన్నారుల దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారుల భక్తి, పర్యావరణ స్పృహ, సేవా భావం, పట్టుదల స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. పురజనులు విద్యార్థులు అందించిన మట్టి వినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.
ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి సేవా సంస్థల స్కూలు కన్వీనర్, గవర్నింగ్ బాడీ సభ్యులు, ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల వారు చూపిన శ్రద్ధతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆచరణలో చూపినందుకు ప్రశంసించారు.
విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు… విలువలను ఆచరించడం, ప్రకృతిని ప్రేమించడం, సమాజానికి సేవ చేయడం. అనే శ్రీ సత్య సాయి విద్యా తత్వానికి ఈ చిన్నారుల ప్రయత్నం ఒక అందమైన ప్రతిబింబంగా నిలిచింది.
0 Comments