పుట్టపర్తి,:విశాఖ సందేశం వర్తవాహని : సెప్టెంబర్ 2:శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక, సాంప్రదాయ వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం జిల్లా నుండి సుమారు 2,000 మంది భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు.
విశాఖ జిల్లా భక్తులు సెప్టెంబర్ 3, 4, 5 తేదీలలో మూడు రోజుల పాటు పర్తి యాత్ర నిర్వహిస్తూ, భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారు.
*శ్రీ ఆర్ జే రత్నాకర్ దంపతులకు ఘన ఆహ్వానం*
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు పుట్టపర్తిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం (ఓల్డ్ మందిర్) వద్ద నిర్వహించనున్న సాంప్రదాయ ‘ఉట్టి కొట్టడం’ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారిని విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు గారు, ఇతర పురుష జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అదేవిధంగా, శ్రీమతి బాల త్రిపురసుందరి (శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు గారి సతీమణి) నేతృత్వంలో శ్రీమతి ఈశ్వరి, శ్రీమతి జయ మల్లాది, శ్రీమతి సోమేశ్వరి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి రాధా సత్యవరపు తదితరులతో కూడిన మహిళా బృందం శ్రీమతి హిమవాహిని రత్నాకర్ గారిని కూడా ఉట్టి కొట్టడం వేడుకకు శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారితో కలిసి విచ్చేసి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానించారు.
శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారు, శ్రీమతి హిమవాహిని రత్నాకర్ గారు ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి, కార్యక్రమం విజయవంతంగా జరగాలని తమ శుభాకాంక్షలను తెలియజేశారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో భక్తి, సంప్రదాయం, సేవాభావం మేళవించిన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశాఖ జిల్లా భక్తులకు మరొక చిరస్మరణీయ ఆధ్యాత్మిక అనుభూతిగా నిలవనున్నాయి.

0 Comments