పుట్టపర్తి,-విశాఖ సందేశం వర్తవాహని -సెప్టెంబర్ 5: సాయికుల్వంత్‌లో బాలవికాస్ విద్యార్థుల ‘సాయి ప్రేమ కుసుమాలు’ సంగీత సమర్పణ – వేదఘోషతో మార్మోగిన కుల్వంత్ హాల్ సభా మండపం – పూర్ణచంద్ర ఆడిటోరియం లో భక్తులకు శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారి ప్రేరణాత్మక సందేశం*
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో విశాఖ జిల్లా భక్తుల మూడు రోజుల పవిత్ర పర్తి యాత్ర ఆనందభరితమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వేద మరియు సంగీత వైభవాల సమ్మేళనంగా భక్తి పరవశంలో ఘనంగా ముగిసింది. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు సాగిన ఈ యాత్రలో విశాఖ జిల్లా నుంచి 2,000 మందికి పైగా శ్రీ సత్యసాయి భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం, ఆశీస్సులు పొందారు.
యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయికుల్వంత్ సభా మండపంలో విశాఖ జిల్లా బాలవికాస్ విద్యార్థినీ విద్యార్థులు ‘సాయి ప్రేమ కుసుమాలు’ పేరిట అద్భుతమైన ఆధ్యాత్మిక సంగీత విభావరిని స్వామివారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సమర్పించారు. చిన్నారుల మధుర గానంతో సభా మండపం భక్తిరసంతో పరవశించగా, వారి సంగీత ప్రతిభ, ఆధ్యాత్మిక భావన, భక్తిశ్రద్ధలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అదే సందర్భంగా విశాఖ జిల్లాకు చెందిన పురుష భక్తులు నిర్వహించిన వేదపఠనంతో సాయికుల్వంత్ సభా మండపం వేదఘోషతో మార్మోగింది. వేద మంత్రాల పవిత్ర నాదం, బాలవికాస్ విద్యార్థుల భక్తి సంగీతం కలిసి కార్యక్రమాలకు విశేష ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి.భక్తి.. వేదఘోష.. సంగీతం.. సాంస్కృతిక సుగంధంతో పర్తి యాత్ర
భక్తి, వేదఘోష, మధుర సంగీతం, సాంస్కృతిక సుగంధం, సేవాస్ఫూర్తి—ఈ అంశాల సమ్మేళనంగా సాగిన విశాఖ జిల్లా మూడు రోజుల పర్తి యాత్ర, స్వామివారి పాదపద్మాలకు సమర్పించిన భక్తి పుష్పమాలికగా నిలిచింది.
మూడు రోజులపాటు నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక, సంగీత, వేద మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించాయి. బాలవికాస్ విద్యార్థుల ప్రతిభ, భక్తుల వేదపఠనం, ఆధ్యాత్మిక సంగీత సమర్పణలు, సాంస్కృతిక కార్యక్రమాలు యాత్రకు ప్రత్యేక శోభను చేకూర్చాయి.
స్వామివారి దివ్య ఆశయాలను ఆచరిస్తూ ప్రేమ, సేవ, త్యాగ మార్గంలో మరింత అంకితభావంతో ముందుకు సాగాలనే సంకల్పంతో విశాఖ జిల్లా భక్తులు పుట్టపర్తి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.స్వామివారి దివ్య సన్నిధిలో మూడు రోజుల ఈ పవిత్ర పర్తి యాత్ర భక్తుల హృదయాల్లో చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచిపోయింది. 🙏💐
సేవే సాయి సందేశానికి సారాంశం- పూర్ణచంద్ర ఆడిటోరియం లో విశాఖ జిల్లా భక్తులకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారి ప్రేరణాత్మక సందేశం*పుట్టపర్తి: విశాఖ జిల్లా పర్తి యాత్ర సందర్భంగా పుట్టపర్తికి విచ్చేసిన వేలాది మంది విశాఖ జిల్లా భక్తులను ఉద్దేశించి ఈరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జే. రత్నాకర్ గారు మాట్లాడుతూ, విశాఖ భక్తుల రాకతో గత మూడు రోజులుగా పుట్టపర్తి మొత్తం ఒక మహా పండుగ వాతావరణాన్ని సంతరించుకుందని అన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పవిత్ర సందర్భంలో ప్రశాంతి నిలయానికి రావడం స్వామి అనుగ్రహమేనని పేర్కొంటూ, “ప్రశాంతి” అంటే కేవలం నిశ్శబ్దం కాదు; అంతరంగ ప్రశాంతత. మనలోని ఆ ప్రశాంతతను మేల్కొల్పేందుకే స్వామి ఈ క్షేత్రానికి ‘ప్రశాంతి నిలయం’ అని నామకరణం చేశారు అని వివరించారు.
స్వామి దృష్టిలో ఎవరూ కొత్తవారు కారని, “మీకు వారు కొత్తవాళ్లు కావచ్చు… కానీ నాకు ఎవరూ కొత్తవారు కాదు. ప్రతి ఒక్కరితో నాకు జన్మజన్మల అనుబంధం ఉంది” అనే స్వామి సందేశాన్ని గుర్తుచేశారు.స్వామి స్థాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విద్యాసంస్థలు ప్రేమ, సేవ, సమానత్వానికి ప్రతిరూపాలని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్సలు, క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు సైతం పుట్టపర్తి లో ఎలాంటి ఫీజు లేకుండా అందించడం స్వామి వారి అనంతమైన ప్రేమకు, అపారమైన సేవా తత్వానికి నిదర్శనమని తెలిపారు. ఆసుపత్రులను సైతం ఆసుపత్రిలా కాకుండా దేవాలయ వాతావరణంలో, ప్రార్థన, కౌన్సెలింగ్, ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా స్వామి రూపొందించారని పేర్కొన్నారు.
“నా దగ్గరకు వచ్చిన వారందరూ నా పిల్లలే. ధనికులు, పేదలు అనే భేదం నాకు లేదు. అందుకే ఎవరి దగ్గర నుంచీ ఒక్క నయాపైసా తీసుకోను” అనే స్వామి మాటలను గుర్తుచేస్తూ, సేవలో స్వామి చూపిన నిస్వార్థత మనందరికీ ఆదర్శమని అన్నారు.
విశాఖ నుంచి వేలాది మంది భక్తులు పుట్టపర్తికి రావడం ఎంతో ఆనందదాయకమని, కనీసం పదివేల మంది భక్తులను ప్రశాంతి నిలయానికి తీసుకురావాలనే సంకల్పం స్వామి ఆశీస్సులతో సాకారం కావాలని ఆకాంక్షించారు.అలాగే, స్వామి భక్తుల పట్ల చూపిన అపారమైన ప్రేమను గుర్తుచేస్తూ, తన ఆరోగ్యం బాగాలేకపోయినా భక్తుల దర్శనం కోసం స్వామి ముందుకు వచ్చేవారని, “భక్తులు లేకపోతే దేవుడికి ఏం పని?” అన్న స్వామి భావాన్ని ప్రస్తావించారు.
“ప్రశాంతి నిలయానికి వచ్చి కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్లకూడదు. ప్రతి యాత్రతో మనలో ఏదో ఒక మంచి మార్పు రావాలి. ఒక చెడు అలవాటును విడిచిపెట్టాలి, ఒక మంచి గుణాన్ని అలవరచుకోవాలి. ప్రతి సారి ఇక్కడి నుంచి మనం మనకంటే మెరుగైన వ్యక్తులుగా తిరిగి వెళ్లాలి” అని శ్రీ రత్నాకర్ పిలుపునిచ్చారు.
చివరగా, “స్వామి మన కోసం ఇంత చేస్తున్నప్పుడు, మనం స్వామి కోసం ఏమి చేస్తున్నాం?” అనే ఆత్మపరిశీలనతో ప్రతి ఒక్కరూ ప్రేమ, సేవ, త్యాగం, మానవతా విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని ఆయన కోరారు.“స్వామి ప్రేమను అనుభవించడమే కాదు… ఆ ప్రేమను సమాజానికి పంచడమే నిజమైన స్వామి సేవ.”
*శ్రీ ఆర్ జె రత్నాకర్ గారి ప్రేరణాత్మక, ఆలోచనాత్మక సందేశాన్ని ఆలకించిన విశాఖ జిల్లా భక్తులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంతో స్ఫూర్తిని పొందారు. స్వామి ప్రేమ, సేవా తత్వం, ఆత్మపరిశీలనకు సంబంధించిన శ్రీ ఆర్.జె . రత్నాకర్ గారి సందేశం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుని, మరింత ప్రేమతో, సేవాభావంతో స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టాలనే స్ఫూర్తిని కలిగించింది*. 🙏💐










0 Comments