గోపాలపట్నం–పాత గోశాల 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణకు కార్యాచరణ. *3.10 కి.మీ. రోడ్డు విస్తరణకు సమగ్ర సర్వే నిర్వహించి వెంటనే మార్కింగ్ చేపట్టాలి. *ప్రభావిత ఆస్తులకు TDR/పరిహారం ప్రక్రియ వేగవంతం చేసి Right of Way సమకూర్చాలి. *మౌలిక వసతులకు VMRDA నిధులు – రోడ్డు నిర్మాణం జీవీఎంసీ ద్వారా చేపట్టాలి. *120 రోజుల లక్ష్యంతో పనులు పూర్తి చేసేందుకు సమన్వయ కార్యాచరణ రూపొందించాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

 


విశాఖపట్నం, ఆగస్టు 28: గోపాలపట్నం జంక్షన్ ఆర్చి నుంచి పాత గోశాల వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని 3.10 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసి, 120 రోజుల లక్ష్యంతో పనులు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాలను చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు, జోనల్ కమిషనర్లు బి. హేమావతి, హెచ్. శంకర్రావు, పర్యవేక్షక ఇంజనీర్లు ఏ. శ్రీనివాసరెడ్డి, కె. శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.

గోపాలపట్నం పెట్రోల్ బంక్, రైతుబజార్ ఖాళీ స్థలం, సమీపంలోని వినాయక దేవాలయం తదితర ప్రాంతాలను పరిశీలించి, ప్రస్తుతం ఉన్న రహదారి, ప్రతిపాదిత విస్తరణకు సంబంధించిన ప్లాన్లను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో మొత్తం 348 ఆస్తులు ప్రభావితమవుతున్నట్లు గుర్తించామని, వాటిలో కుడివైపు 210, ఎడమవైపు 138 ఆస్తులు ఉన్నట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొత్తం 3.10 కి.మీ. రహదారి విస్తరణ పై సమగ్ర సర్వే నిర్వహించి వెంటనే మార్కింగ్ చేపట్టాలని, ఇరువైపులా ప్రభావితమయ్యే ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ ఆస్తులను గుర్తించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని చీఫ్ సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. ప్రభావిత ఆస్తులకు పెండింగ్‌లో ఉన్న TDR/పరిహారం ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేసి Right of Way సమకూర్చాలని సూచించారు. ఇందుకు పెందుర్తి తహసీల్దార్‌ను భాగస్వామ్యం చేస్తూ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.

రోడ్డు విస్తరణలో భాగంగా సెంటర్ మీడియన్లు/డివైడర్లు, అవసరమైన చోట రక్షణ గోడలు, ఇతర మౌలిక వసతులకు అవసరమైన అంచనాలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని పర్యవేక్షక ఇంజనీర్ ఏ. శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో కొంత భాగం ప్రభావితమయ్యే దేవాలయ పూజారితో కమిషనర్ మాట్లాడుతూ, నిబంధనల మేరకు తగిన Structural Compensationను జీవీఎంసీ అందిస్తుందని, రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు.

రోడ్డు విస్తరణను వేగవంతంగా పూర్తి చేసేందుకు Right of Wayతో పాటు అవసరమైన పరిహార ప్రక్రియను జీవీఎంసీ చేపట్టడం, మౌలిక వసతులకు VMRDA ద్వారా నిధులు సమకూర్చడం, రోడ్డు నిర్మాణాన్ని జీవీఎంసీ ద్వారా చేపట్టడం అనే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేసి 120 రోజుల లక్ష్య కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, జోనల్ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో కార్యనిర్వాహక ఇంజనీర్లు దిలీప్, మాధవరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ రామ్మోహన్ రావు, ఏసీపీ రామలింగేశ్వర రెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Post a Comment

0 Comments