*ఆర్మీ నియామక ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి* * జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ * సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20 వరకు విశాఖలో నిర్వహణ * హాజరు కానున్న 10,350 మంది అభ్యర్థులు


విశాఖపట్నం, ఆగస్టు 28: అగ్నివీర్‌ పథకం కింద సెప్టెంబర్‌ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్‌.కె. బీచ్‌ రోడ్డులోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఇద్దరు నోడల్‌ అధికారులను నియమించారు. ర్యాలీ ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, బారికేడింగ్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్‌, భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని పోలీస్‌ శాఖకు సూచించారు.

వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ర్యాలీ ప్రాంగణం, రన్నింగ్‌ సైట్‌ వద్ద వైద్య బృందాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అగ్నిప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఫైర్‌ టెండర్‌ను, విద్యుత్‌ అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ర్యాలీకి సంబంధించిన తేదీలు, అర్హతలు, వేదిక, ఇతర సూచనలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు అప్పగించిన పనులను ర్యాలీ ప్రారంభానికి ముందే పూర్తి చేసి, లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సమావేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి, కల్నల్ అమరేష్ సింగ్, ఇంచార్జి డీఆర్వో టి. గోవిందు, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

.

Post a Comment

0 Comments