విభిన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాలి - నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌, ఆధునిక సాంకేతికతపై దృష్టి సారించాలి


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఆగస్టు 28: ఇంజినీరింగ్‌ విద్యార్థులు కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా, తమకు సంతృప్తినిచ్చే కెరీర్‌ను లక్ష్యంగా చేసుకుని నాలుగేళ్ల విద్యాభ్యాసాన్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్ డాక్ట‌ర్ శంఖబ్రత బాఘ్చి సూచించారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన త‌రువాత‌ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు స్టార్టప్‌లు, ఉన్నత విద్య, పరిశోధన, సివిల్‌ సర్వీసెస్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, ఎంబీఏ తదితర అవకాశాలను తొలి దశలోనే గుర్తించి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో  నూతనంగా ప్రవేశం పొందిన ఇంజ‌నీరింగ్‌ విద్యార్థులకు  ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఓరియంటేషన్‌–ఇండక్షన్‌ కార్యక్రమం–2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిశ్రమల అవసరాలను మొదటి సంవత్సరం నుంచే తెలుసుకుని, వాటికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవవచ్చని శంఖబ్రత బాఘ్చి అన్నారు. చదువుతో పాటు సంబంధిత రంగాల్లో ఇంటర్న్‌షిప్‌ అనుభవం సంపాదించుకోవాలని సూచించారు. అకడమిక్‌ ప్రతిభతో పాటు మాట్లాడటం, రాయడం, వినడం, విషయాలను అర్థం చేసుకోవడం వంటి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కెరీర్‌లో కీలకమని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌తో పాటు తాము పనిచేయాలనుకునే ప్రాంతానికి సంబంధించిన భాషపై పట్టు సాధించడం కూడా ప్రయోజనకరమన్నారు.

మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా రోబోటిక్స్‌, బ్లాక్‌చెయిన్‌, డేటా మైనింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయంలోని విద్యతో పాటు నాణ్యమైన ఆన్‌లైన్‌ కోర్సులను అభ్యసించి తమ రెజ్యూమ్‌ను బలోపేతం చేసుకోవాలని అన్నారు.


జీవితం మారథాన్‌ వంటిది. ముందుకు సాగాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం” అని పేర్కొన్న ఆయన, విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆందోళన, అధికంగా ఆలోచించడం, ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకుని, నిరంతరం అభివృద్ధి చెందాలని హితవు పలికారు. తగినంత నాణ్యమైన నిద్ర, సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం విజయవంతమైన విద్యార్థి జీవితానికి పునాదులని చెప్పారు. 

ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఏయూ పూర్వ విద్యార్థి రామ వేల్పూరి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా ఇంజినీరింగ్‌ మౌలిక సూత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

నాలుగేళ్ల విద్యాభ్యాసంలో సమయపాలన, గణితం–భౌతికశాస్త్రాల్లో పునాదులు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి, సాఫ్ట్‌స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం రెండు గంటలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అభ్య‌స‌నానికి కేటాయించాలని చెప్పారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తుందనే ఆందోళన అవసరం లేదని, అయితే ఏఐని సమర్థంగా వినియోగించగల నైపుణ్యం ఉన్నవారే భవిష్యత్‌ అవకాశాల్లో ముందుంటారని స్పష్టం చేశారు. ఒకే ప్రోగ్రామింగ్‌ భాష లేదా సాంకేతిక నైపుణ్యంపై ఆధారపడకుండా ఇంజినీరింగ్‌ మౌలిక సూత్రాలను బలంగా నేర్చుకోవాలని సూచించారు. పరిశ్రమలతో అనుసంధానం, ఇంటర్న్‌షిప్‌లపై దృష్టి పెట్టాలని అన్నారు. చివరి ఏడాదిలో ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఉద్యోగావకాశాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

“సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగానికి తలుపులు తెరిస్తే, కమ్యూనికేషన్‌, టీమ్‌వర్క్‌ వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ కెరీర్‌లో రాణించ‌డానికి తోడ్పడతాయి” అని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మార్కులు, గ్రేడ్‌లకే పరిమితం కాకుండా వారి నైపుణ్యాలు, ఆసక్తులు, ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు.

ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నందుకు విద్యార్థులు గర్వపడేలా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల హాస్ట‌ల్‌లు, మెగా మెస్‌, స్టూడెంట్‌ యాక్టివిటీస్‌ సెంటర్‌ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో వంటశాలలు, డైనింగ్‌ ప్రాంతాల అభివృద్ధి పూర్తయిందని, ఇతర ఆధునీక‌ర‌ణ‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఆధునిక సాంకేతిక విద్యకు ఏయూ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌లో బీటెక్‌ కోర్సుతో పాటు వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో కొత్త కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. డ్రగ్‌ టెస్టింగ్‌, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్‌, 5జీ–6జీ కమ్యూనికేషన్‌, ఏఐ–జీపీయూ కంప్యూటింగ్‌ వంటి రంగాల్లో ఆధునిక పరిశోధనా ల్యాబ్‌ల ఏర్పాటుకు సంస్థలు, పూర్వ విద్యార్థులు సహకరిస్తున్నారని వివరించారు.

ఇంజినీరింగ్‌లో చేరిన వెంటనే విద్యార్థులు చదువుపై నిర్లక్ష్యం చేయకుండా అకడమిక్స్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకుంటూ ప్రతి సబ్జెక్టును సకాలంలో పూర్తి చేయడంతో పాటు హాజరు విషయంలో విశ్వవిద్యాలయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అధ్యాపకులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలుమ్ని మెంటార్‌షిప్‌, కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (A) ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇంజినీరింగ్‌లో ప్రవేశం లక్ష్య సాధనకు ముగింపు కాదని, నాలుగేళ్ల విద్యాభ్యాసానికి ఆరంభమని అన్నారు. విద్యార్థులు తమ విభాగానికే పరిమితం కాకుండా కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.

ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌. పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ప్రయోగశాలలు, మౌలిక వసతులు, హాస్టల్‌ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.  2025–26 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల్లో 75 శాతం మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. పరిశోధన, క్రీడలు, ఎన్‌సీసీ తదితర రంగాల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. కళాశాల డ్రగ్స్‌, ర్యాగింగ్‌ రహిత క్యాంపస్‌గా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

కార్యక్రమ కోఆర్డినేటర్‌ ఆచార్య కె. పద్మ మాట్లాడుతూ... విద్యార్థుల సంక్షేమం, భద్రత, సమ్మిళితత్వం, కెరీర్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ తదితర అంశాలపై ప్రత్యేక అవగాహనా సెషన్లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 


విద్యార్థులకు వ‌ర్సిటీలో అందుబాటులో ఉన్న విద్యా, పరిశోధన, సాంకేతిక, వసతి, కెరీర్‌ అవకాశాలను పరిచయం చేయడంతో పాటు బాధ్యతాయుతమైన విద్యార్థి జీవితంపై అవగాహన కల్పించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అతిధుల‌ను స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో మాజీ వీసీ ఆచార్య జి.ఎస్‌.ఎన్ రాజు, పాల‌క మండ‌లి స‌భ్యులు ఆచార్య వి.వ‌ల్లీ కుమారి, ఆచార్య టి.చిట్టిబాబు, విభాగాధిప‌తులు, ఆచార్యులు, ప‌రిశోధ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments