మరణంలోనూ మానవత్వం చాటిన పెందుర్తి వాసి.. అవయవదానంతో ముగ్గురికి పునర్జన్మ*


 విశాఖపట్నం, ఆగస్టు 27:*తాను మరణించినా, తన అవయవాలతో మరికొందరిని బతికించవచ్చు అనే గొప్ప ఆలోచనకు పెందుర్తి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం నిదర్శనంగా నిలిచింది. విషాదంలోనూ ఎంతో ధైర్యంతో వారు తీసుకున్న నిర్ణయం వల్ల ముగ్గురు రోగులకు కొత్త జీవితం లభించింది.

*నడకకు వెళ్లి కుప్పకూలిన వృద్ధుడు*పెందుర్తికి చెందిన కె.ఎస్. భాస్కరరావు గారి వయస్సు 60 సంవత్సరాలు. ఎప్పటిలాగే ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా కుప్పకూలి కిందపడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆయన కుటుంబానికి, స్నేహితులకు సమాచారం ఇచ్చారు.

స్నేహితులు హుటాహుటిన అంబులెన్సును పిలిపించి, నగరంలోని హెల్త్ సిటీలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. మూడు రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.

చివరకు బుధవారం సాయంత్రం వైద్యులు ఆయన మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందని, మెదడు మరణం సంభవించిందని ప్రకటించారు.

*కుటుంబ సభ్యుల మహోన్నత నిర్ణయం*

కన్నీరుమున్నీరవుతున్న ఆ సమయంలోనూ భాస్కరరావు గారి కుటుంబ సభ్యులు ఎంతో నిబ్బరంగా ఆలోచించారు. మా వారు ఇక తిరిగి రారు, కనీసం ఆయన అవయవాలతో మరికొందరైనా బతుకుతారని భావించి అవయవదానానికి ముందుకు వచ్చారు.

వెంటనే జీవందాన్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వగా, వారు ఆసుపత్రికి చేరుకుని అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అవయవదానానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని కుటుంబానికి అందజేశారు.

ఈ మొత్తం ప్రక్రియ  విమ్స్ డైరెక్టర్ రాష్ట్ర జీవన్ డాన్ సమన్వయకర్త డాక్టర్ మన్మధరావు   ఆధ్వర్యంలో సజావుగా జరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ మరియు అత్యవసరత ఆధారంగా అవయవాలను కేటాయించారు.

- ఒక మూత్రపిండం మరియు కాలేయం - అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు

- రెండవ మూత్రపిండం - విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉన్న రోగికి

ఈ అవయవాలతో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం జరిగింది.

*గ్రామంలో అంత్యక్రియలు*

అవయవ సేకరణ అనంతరం ఈరోజు ఉదయం భాస్కరరావు గారి భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించారు. అనంతరం పెందుర్తి స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

*వైద్యుల ప్రశంసలు*

భాస్కరరావు గారి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముగ్గురికి కొత్త జీవితం వచ్చిందని, వారి త్యాగం మరువలేనిదని అపోలో ఆసుపత్రి వైద్యులు, జీవందాన్ ప్రతినిధులు కొనియాడారు. ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయాలు సమాజంలో అవయవదానంపై అవగాహన పెంచుతాయని వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments