గ్లోబల్‌ బిజినెస్‌ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యం - అలుమ్నితో అనుసంధానం కావాలి - కెరియ‌ర్ ప్లానింగ్‌ని వాయిదా వేయ‌వ‌ద్దు

 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఆగ‌ష్టు 22: గ్లోబల్‌ బిజినెస్‌ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యం గా  ఆంధ్ర విశ్వవిద్యాలయం  పనిచేస్తుందని అదేవిధంగా మారుతున్న అంతర్జాతీయ వ్యాపార రంగానికి అనుగుణంగా విద్యార్థులు తమ కెరీర్‌ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుని, పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ప్ర‌ధ‌మ సంవత్స‌రం విద్యార్థుల‌కు నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కెరీర్‌ ప్రణాళికను వాయిదా వేయకుండా విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రారంభించాలని  సూచించారు. ఇంటర్న్‌షిప్‌లను అన్వేషించడంతో పాటు తాము ఆసక్తి చూపుతున్న రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా ఆధారిత నిర్ణయాలు, మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు.


విద్యార్థుల భవిష్యత్‌ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల (అలుమ్ని) భాగస్వామ్యం కీలకమని ఆచార్య రాజశేఖర్‌ తెలిపారు. ప్రతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులను ప్రస్తుత విద్యార్థులతో అనుసంధానించి, మెంటార్‌షిప్‌, కెరీర్‌ మార్గదర్శకత్వం అందించే విధంగా అలుమ్ని మెంటార్‌షిప్‌ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.పూర్వ విద్యార్థులు నేటిత‌రం విద్యార్థుల‌కు పరిశ్రమ అవ‌స‌రాలు, మార్పుల‌పై అవగాహన, కెరీర్‌ మార్గదర్శకత్వం, ఉద్యోగ–ఇంటర్న్‌షిప్‌ అవకాశాలపై సమాచారం అందించాల‌ని సూచించారు. అలుమ్ని నెట్‌వర్క్‌తో అనుసంధానం కావాలని సూచించారు.

విద్యార్థులకు విస్తృతమైన పరిశ్రమ అనుభవాన్ని అందించేందుకు పరిశ్రమ నిపుణులను విశ్వవిద్యాలయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు ఉపకులపతి తెలిపారు. అడ్వైజరీ కమిటీలు, పరిశ్రమ నిపుణుల సహకారంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.విద్యార్థులు కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచంలోని పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో క్యాంపస్‌ క్రమశిక్షణను పాటిస్తూ, విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి చర్యలకు సహకరించాలని కోరారు.

స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ ఆచార్య జి. రాంబాబు మాట్లాడుతూ, మారుతున్న అంతర్జాతీయ వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు, గ్లోబల్‌ దృక్పథం, సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే స్కూల్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌(ఏయూ-సిబ్‌) ప్రధాన లక్ష్యమని తెలిపారు. కోర్సులో భాగంగా మొదటి, రెండో సంవత్సరాల ముగింపులో విద్యార్థులకు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ కల్పించే విధానం ఉందని తెలిపారు. చివరి సెమిస్టర్‌లో పూర్తి స్థాయి ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన, వృత్తిపరమైన అనుభవం లభిస్తుందని వివరించారు.


దేశీయ, అంతర్జాతీయ విద్యార్థులు ఒకే విద్యా వాతావరణంలో చదువుకోవడం వల్ల భిన్నమైన ఆలోచనా విధానాలు, సంస్కృతులపై అవగాహన, సాంస్కృతిక మేధస్సు అభివృద్ధి చెందుతాయని ఆచార్య రాంబాబు పేర్కొన్నారు. నేటి గ్లోబల్‌ బిజినెస్‌ ప్రపంచంలో ఇవి అత్యంత కీలకమైన నైపుణ్యాలని తెలిపారు. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల నిపుణులతో భాగస్వామ్యంతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా, పారిశ్రామిక అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

“రేపటి ప్రపంచం కోసం నేడు సిద్ధమయ్యే వారిదే భవిష్యత్తు” అనే భావనను ప్రస్తావిస్తూ, విద్యార్థులు కేవలం MBA పట్టాను పొందడమే కాకుండా కొత్తగా ఆలోచించే సామర్థ్యం, అంతర్జాతీయ దృక్పథం, వాస్తవ ప్రపంచ అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో విద్యార్థులను అంతర్జాతీయ వ్యాపార రంగంలో ఎదురయ్యే అవకాశాలు, సవాళ్లకు సిద్ధం చేయడమే స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ప్రధాన లక్ష్యమని ఆచార్య రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో  అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


https://www.youtube.com/watch?v=rt3I4dFu9e0&t=135s


Post a Comment

0 Comments