సింహాచలం, ఆగస్టు 22, 2026:శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన సింహాచలం నేడు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శనివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు సింహగిరిపై పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్యం తదితర అంశాలను సమీక్షించారు.
ముందుగా రూ.100, రూ.300 దర్శనం క్యూలైన్లతో పాటు ఉచిత క్యూలైన్లను ఈఓ పరిశీలించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని గమనించి, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం ప్రసాదాల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ, అక్కడ ఏర్పాటు చేసిన హీటర్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా, సక్రమంగా జరిగేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే వన్‌స్టాప్ సెంటర్ సమీపంలో ప్రసాదాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిని పరిశీలించిన ఈఓ, అక్కడ కూడా అవసరమైన హీటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబును ఆదేశించారు. భక్తులకు , నాణ్యమైన ప్రసాదం అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఈఓ జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ, “సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురికాకుండా చూడటమే దేవస్థానం ప్రధాన లక్ష్యం. రద్దీ రోజుల్లో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా నిరంతర పర్యవేక్షణతో ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు.
దేవస్థానం ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు వివిధ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన దిశానిర్దేశం చేస్తూ సేవలందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు.







0 Comments