మాతృభాషను గౌరవించడం మన సంస్కృతిని గౌరవించడమే” — తెలుగు భాష వైభవాన్ని స్మరించి,-తెలుగుభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవాసమితి సభ్యులు*

 


శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగుభాషా దినోత్సవాన్ని ఉక్కునగరం శ్రీ  సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో   ఈ రోజు (శనివారం) ఉదయం ఉక్కునగరం KBR జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

ఉదయం 6.30 గంటలకు ఓంకారం, వేదపఠనం, సాయిగాయత్రీ మరియు భజనలతో కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలుగు భాష చరిత్ర, వైభవం, విశిష్టత, కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులపై వక్తలు ప్రసంగించారు.

ఆంగ్లభాష ప్రభావం పెరిగిన క్రమంలో తెలుగుభాషలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, మాతృభాషను పరిరక్షించడం, గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు  తెలుగుభాష పట్ల చూపిన అపారమైన ప్రేమను  వక్తలు ప్రత్యేకంగా గుర్తుచేశారు. అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు  తెలుగులోనే ప్రసంగించడం, తెలుగులోనే భజనలు పాడటం, తెలుగులోనే మానవతా విలువలు చాటి చెప్పే బాలవికాస్ శిక్షణ ప్రారంభించడం,   తెలుగులోనే రచనలు చేయడం, తెలుగులోనే ఉత్తరాలు రాయడం ద్వారా తెలుగు భాష పట్ల తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటిచెప్పారని, తెలుగువారందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

అలాగే తెలుగుభాష అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ సి. పి. బ్రౌన్, శ్రీ రంగాచారి మరియు శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారి అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా వ్యవహారిక భాషోద్యమానికి శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు తెలుగు తల్లి వైభవాన్ని, తెలుగు భాషా సంస్కృతిని కీర్తించే ప్రసిద్ధ గేయం  శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు  రచించిన ‘ మా  తెలుగు  తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విశాఖ జిల్లా సేవా విభాగం సమన్వయకర్త  ఆర్. ఎ. నాయుడు, ఉక్కునగరం శ్రీ సత్య సేవా సమితి   కన్వీనర్ సన్యాసి రాజు, కె. ఎస్. ఎన్. రాజు, జి. రామకృష్ణ, రవికుమార్, కె. వి. రమణ, కె. వి. ఎల్. ఎన్. రెడ్డి, వి. కృష్ణ, ప్రకాష్, విందుల వరహాలు, శ్యామ్, రామచంద్రరావు, వేణు తదితరులు పాల్గొన్నారు.

చివరగా తెలుగుతల్లికి మంగళహారతి సమర్పించడంతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది.

“తెలుగు భాష – మన అస్తిత్వానికి ప్రతీక; మన సంస్కృతికి సజీవ వారసత్వం.”

Post a Comment

0 Comments