రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ‘ఉన్నచోటనే మురికివాడ పునరాభివృద్ధి’కి  విశాఖ వెలంపేటలో శ్రీకారం. * వెలంపేట లక్ష్మీనగర్‌లో రూ.28.44 కోట్లతో 177 పేద కుటుంబాలకు ఆధునిక బహుళ అంతస్తుల గృహ సముదాయం. * స్టిల్ట్+12 అంతస్తులతో నిర్మాణం – ఒక్కో గృహం విలువ రూ.16.07 లక్షలు. * లబ్ధిదారులను ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలించకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే పునరాభివృద్ధి. * తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి చేసి జూన్ 2027 నాటికి లబ్ధిదారులకు గృహాలు అందించాలి. * ప్రత్యామ్నాయ నివాస అద్దె సహాయంగా లబ్ధిదారులకు రూ.31.86 లక్షలు అందజేత. * విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో చారిత్రాత్మక ముందడుగు. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.  

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మురికివాడలో నివసిస్తున్న పేద కుటుంబాలను ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలించకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే ఆధునిక బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని నిర్మించి పునరావాసం కల్పించే ప్రతిష్టాత్మక ‘ఉన్నచోటనే మురికివాడ పునరాభివృద్ధి (In-situ Slum Redevelopment)’ ప్రాజెక్టుకు విశాఖపట్నంలో బుధవారం రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో చేపడుతున్న కార్యాచరణలో భాగంగా, జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని వెలంపేట లక్ష్మీనగర్‌లో రూ.28.44 కోట్లతో 177 పేద కుటుంబాలకు ఆధునిక గృహ సముదాయం నిర్మించే ప్రాజెక్టుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ వైద్యసేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి. రామిరెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పేదల జీవన ప్రమాణాలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టు – మంత్రి నారాయణ”ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి విశాఖలో వెలంపేట ప్రాజెక్టు చారిత్రాత్మక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పట్టణ పేదలకు కేవలం గృహాలను నిర్మించి ఇవ్వడమే కాకుండా, వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం, మెరుగైన జీవన ప్రమాణాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా వెలంపేట లక్ష్మీనగర్‌లో పరిమిత స్థలంలో, ఇరుకైన పరిస్థితుల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు అదే ప్రాంతంలో ఆధునిక గృహాలను నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. సాధారణంగా మురికివాడల పునరాభివృద్ధిలో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి, పిల్లల విద్య, సామాజిక సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అయితే వెలంపేటలో లబ్ధిదారులను శాశ్వతంగా మరో ప్రాంతానికి తరలించకుండా, వారు నివసిస్తున్న ప్రదేశంలోనే పునరాభివృద్ధి చేపట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రత్యేకతని వివరించారు.


రాష్ట్రంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఆదర్శవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో ఇతర మురికివాడల పునరాభివృద్ధికి నమూనాగా నిలపాలని అధికారులను ఆదేశించారు.

తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలి – జూన్ 2027 లక్ష్యం.

శంకుస్థాపన సందర్భంగా నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్‌తో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడి, పేద కుటుంబాలు ఎక్కువకాలం ప్రత్యామ్నాయ నివాసాల్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. తొమ్మిది నెలల కాలంలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి జూన్ 2027 నాటికి లబ్ధిదారులకు గృహాలను అందించాలని ఆదేశించగా, అందుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. పనుల వేగంతో పాటు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడరాదని మంత్రి స్పష్టం చేశారు.

వెలంపేట ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారమవుతోంది – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్”


సభాధ్యక్షులు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, వెలంపేట లక్ష్మీనగర్‌లోని పేద కుటుంబాల చిరకాల ఆకాంక్ష ఈ ప్రాజెక్టుతో కార్యరూపం దాల్చుతోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నివాస, మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా చారిత్రాత్మక అడుగు పడిందన్నారు.


తమ నియోజకవర్గంలోని పేద కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాన్ని విడిచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అదే ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో ఆధునిక గృహాలను నిర్మించి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. దీనివల్ల వారి జీవనోపాధి, పిల్లల విద్య, సామాజిక అనుబంధాలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు.

వేలంపేట ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ప్రాజెక్టుకు సహకరించిన ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు లబ్ధిదారులు జీవీఎంసీ, నిర్మాణ సంస్థకు పూర్తి సహకారం అందించాలని కోరారు.


రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి – కలెక్టర్ అభిషిక్త్ కిషోర్”

విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ, ఉన్నచోటనే మురికివాడ పునరాభివృద్ధి సాధారణ గృహ నిర్మాణ ప్రాజెక్టుతో పోలిస్తే అనేక సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ అని పేర్కొన్నారు. పరిమిత స్థలంలో ప్రణాళిక రూపొందించడం, ప్రస్తుతం నివసిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించడం, నిధుల సమీకరణ, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు.

ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు, లబ్ధిదారుల సమన్వయం, సహకారంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం అభినందనీయమన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి దశలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మంత్రి నిర్దేశించిన గడువులో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ, జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వెలంపేట ప్రాజెక్టు విజయవంతమై విశాఖలోని ఇతర మురికివాడలతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలకు కూడా మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.


“నేడు చరిత్ర సృష్టిస్తున్నాం” – కమిషనర్ కేతన్ గార్గ్”

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, వెలంపేట లక్ష్మీనగర్ మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం విశాఖ నగరాభివృద్ధి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా అరుదుగా అమలవుతున్న ‘In-situ Slum Redevelopment’ విధానంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మంజూరు, కార్యరూపం దాల్చడంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ప్రత్యేక చొరవతో నిరంతరం సహకరించారని, వారి కృషితో అవసరమైన ప్రభుత్వ అనుమతులు, మంజూరులు లభించాయని తెలిపారు.

ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా విశాఖపట్నాన్ని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కార్యాచరణ చేపడుతోందన్నారు. తొలి నమూనా ప్రాజెక్టుగా వేలంపేట లక్ష్మీనగర్‌ను ఎంపిక చేసి, లబ్ధిదారుల వివరాలు, అందుబాటులో ఉన్న స్థలం, నిర్మాణ సాధ్యాసాధ్యాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టినట్లు వివరించారు.

పరిమిత స్థలం, నిర్మాణ నిబంధనలు, నిధుల సమీకరణ, లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ నివాసం వంటి సవాళ్లను అధిగమించి ప్రాజెక్టును శంకుస్థాపన దశకు తీసుకురావడం జరిగిందన్నారు. వెలంపేట ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో ఇతర మురికివాడల పునరాభివృద్ధికి అనుసరించగల ఆదర్శ నమూనాగా రూపొందించడమే జీవీఎంసీ లక్ష్యమని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు జూన్ 2027 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనుల పురోగతి, నాణ్యతను జీవీఎంసీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.


రూ.28.44 కోట్లతో 177 కుటుంబాలకు ఆధునిక గృహాలు”వేలంపేట లక్ష్మీనగర్‌లో 2,691 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.28.44 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 177 లబ్ధిదారుల కుటుంబాలకు స్టిల్ట్+12 అంతస్తులతో ఆధునిక గృహ సముదాయాన్ని నిర్మించనున్నారు. స్టిల్ట్ అంతస్తును పార్కింగ్, ఇతర సేవలకు వినియోగించనుండగా, మొదటి నుంచి 11వ అంతస్తు వరకు ఒక్కో అంతస్తులో 15 చొప్పున గృహాలు, 12వ అంతస్తులో 12 గృహాలు నిర్మించనున్నారు.

ఒక్కో గృహ యూనిట్ విస్తీర్ణం 328 చదరపు అడుగులు కాగా, కామన్ ఏరియాతో కలిపి సూపర్ బిల్టప్ ఏరియా 410 చదరపు అడుగులు ఉంటుంది. ఒక్కో గృహం విలువ రూ.16.07 లక్షలు. ఇందులో పీఎంఏవై కింద రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1 లక్ష, లబ్ధిదారుల వాటాగా రూ.3.50 లక్షలు, మిగిలిన రూ.10.07 లక్షలను TDR రూపంలో Viability Gap ద్వారా సమకూర్చనున్నారు.

రూ.31.86 లక్షల అద్దె సహాయం – లబ్ధిదారులకు హామీపత్రాలు.

గృహ సముదాయ నిర్మాణం చేపట్టే సమయంలో లబ్ధిదారులు ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో అద్దెకు నివసించేందుకు వీలుగా నెలకు రూ.3,000 చొప్పున అద్దె సహాయం కింద మొత్తం రూ.31.86 లక్షలను లబ్ధిదారులకు అందజేశారు. నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

సభ అనంతరం పలువురు లబ్ధిదారులకు నూతన గృహాలకు సంబంధించిన హామీపత్రాలను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు అందజేశారు.

అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రత్యేకత, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.


ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఇరుకైన గృహాల్లో నివసిస్తూ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ ప్రాజెక్టుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. తమను ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలించకుండా, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే ఆధునిక గృహాలను నిర్మించి ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.ఎం. సత్యవేణి, ఎస్.ఎస్. వర్మ, కె. రమేష్, ప్రధాన ఇంజనీరు పి.వి.వి. సత్యనారాయణ రాజు, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజనీరు ఏడుకొండలు, ప్రధాన వైద్యాధికారి ఇన్‌చార్జి డాక్టర్ కృష్ణంరాజు, ఏపీడీ పద్మావతి, మాజీ కార్పొరేటర్లు విల్లూరి భాస్కరరావు, భీశెట్టి వసంతలక్ష్మి, బీజేపీ నాయకులు బొత్స సురేష్, జనసేన పార్టీ నాయకులు శివప్రసాద్, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ సూర్య, జీవీఎంసీ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ


 


Post a Comment

0 Comments