జీవీఎంసీ ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంకు విశేష స్పందన – రెండు రోజుల్లో 438 వినతులు. *APDPMS, LRS, TDR పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ – రెండు రోజుల్లో 237 దరఖాస్తుల పరిష్కారం. *ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

 


విశాఖపట్నం, సెప్టెంబర్ 11: జీవీఎంసీ పరిధిలో APDPMS ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెండు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రెండు రోజుల్లో మూడు అంశాలకు సంబంధించి మొత్తం 438 వినతులు అందాయి.

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరం నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యక్షతన అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి తదితరులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి అందిన వినతులు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు.

రెండు రోజుల్లో 438 వినతులు – 237 దరఖాస్తుల పరిష్కారం"

 తొలిరోజు గురువారం 267 వినతులు అందగా, వాటిలో APDPMSకు సంబంధించి 63, LRSకు సంబంధించి 191, TDRకు సంబంధించి 13 వినతులు ఉన్నాయి. రెండో రోజు శుక్రవారం మరో 171 వినతులు అందగా, వాటిలో APDPMSకు సంబంధించి 37, LRSకు సంబంధించి 113, TDRకు సంబంధించి 21 వినతులు ఉన్నాయి. దీంతో రెండు రోజుల్లో కలిపి APDPMSపై 100, LRSపై 304, TDRపై 34 చొప్పున మొత్తం 438 వినతులు అందాయి

ప్రత్యేక ఓపెన్ ఫోరం ద్వారా పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు రోజుల గణాంకాల ప్రకారం APDPMSకు సంబంధించి 124, LRSకు సంబంధించి 95, TDRకు సంబంధించి 18 చొప్పున మొత్తం 237 దరఖాస్తులను పరిష్కరించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (LTPs) ఒకేచోట అందుబాటులో ఉండటంతో దరఖాస్తుల్లోని సమస్యలను నేరుగా పరిశీలించి, అవసరమైన వివరణలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు అవకాశం కలిగింది.

 ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, ప్రజలు వివిధ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పెండింగ్ సమస్యలను ఒకేచోట సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ టౌన్ ప్లానింగ్ సమస్యలన్నింటికీ కాకుండా APDPMS పెండింగ్ అనుమతులు/సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యలు అనే మూడు అంశాలపైనే ప్రత్యేక దృష్టి సారించి రెండు రోజుల కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. తదుపరి పరిశీలన అవసరమైన దరఖాస్తుల విషయంలో సంబంధిత అధికారులు, LTPలతో సమన్వయం చేసుకొని, దరఖాస్తుల్లో అవసరమైన లోపాలను సరిదిద్ది, అనవసర జాప్యానికి తావులేకుండా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రెండు రోజుల ప్రత్యేక ఓపెన్ ఫోరంలో మొదటి రోజు 107 మంది అధికారులు, సిబ్బంది, 61 మంది LTPలు, రెండో రోజు 74 మంది అధికారులు, సిబ్బంది, 104 మంది LTPలు పాల్గొన్నారు. అలాగే LTPల ద్వారా మొదటి రోజు 83, రెండో రోజు 76 చొప్పున మొత్తం 159 LRS దరఖాస్తులు సమర్పించబడ్డాయి.

ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక ఓపెన్ ఫోరంలో ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టీపీపీవోలు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు (WPRS), లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (LTPs), టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ.


 



Post a Comment

0 Comments