జీవీఎంసీలో 98 నుంచి 120 కి పెరిగిన వార్డులు.. * 120 వార్డుల పునర్విభజనను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురణ. * కొత్త వార్డుల పరిధిని నగర ప్రజలు గమనించాలి. * కొత్తగా ఖరారైన వార్డుల వారీగా సెప్టెంబర్ 22న ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణ. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


విశాఖపట్నం, సెప్టెంబర్ 15: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (GVMC) పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ ఖరారు చేసిన వార్డుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 14వ తేదీన గెజిట్‌లో ప్రచురించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియ మేరకు ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం, వాటిని పరిశీలించి జీవీఎంసీ పరిధిలో 120 వార్డుల పునర్విభజనను ఖరారు చేస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కమిషనర్ తెలిపారు.

కొత్తగా ఖరారైన 120 వార్డులకు సంబంధించిన పరిధులు, సరిహద్దుల వివరాలను గెజిట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ మార్పును గమనించి, తాము నివసిస్తున్న ప్రాంతం పునర్విభజన అనంతరం ఏ వార్డు పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలని కమిషనర్ సూచించారు.

అదేవిధంగా, పునర్విభజన చేసిన కొత్త వార్డుల ప్రాతిపదికన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22వ తేదీన ప్రచురించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 01.01.2026ను అర్హత తేదీగా (Qualifying Date) పరిగణనలోకి తీసుకొని, తాజా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాల ఆధారంగా జీవీఎంసీ కొత్త వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జీవీఎంసీకి సంబంధించి ఆయా జోన్ల పరిధిలో వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలను సంబంధిత జోనల్ కమిషనర్లు నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.

కావున నగర ప్రజలు కొత్తగా ఖరారైన వార్డుల పరిధులను గమనించడంతో పాటు, సెప్టెంబర్ 22న ప్రచురించే వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల్లో తమ వివరాలను పరిశీలించుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Post a Comment

0 Comments