*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ప‌క్కా ప్ర‌ణాళిక‌.. స‌రైన వ్యూహంతోనే అనకాపల్లి జిల్లాకు ఉజ్వ‌ల భ‌విష్యత్తు* *జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్* *అజెండా అంశాల‌ను వివ‌రించ‌టంతో పాటు, అధికారుల‌కు దిశానిర్దేశం* *జిల్లా అధికారులతో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం* *ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లపై సూచ‌న‌లు చేసిన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్.*


 అనకాపల్లి, సెప్టెంబర్ 15: ప‌క్కా ప్ర‌ణాళిక‌....కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలోని అధికార యంత్రాంగం స‌మ‌ష్టి కృషి, స‌మ‌న్వ‌యంతో, స‌రైన వ్యూహంతోనే అనకాపల్లి జిల్లాకు ఉజ్వ‌ల భ‌విష్యత్తు  సాధ్య‌మ‌వుతుంద‌ని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అధ్యక్షతన

మండల, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన త్రైమాసిక సమీక్ష సమావేశంలో మౌలిక వసతులు మరియు వివిధ అభివృద్ధి పనులపై కీలక చర్చలు  జరిగాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా రైల్వే మరియు జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. 

రైల్వే పరిధిలో కొత్తగా మంజూరైన పనులు, టెండర్ దశలో ఉన్న ప్రాజెక్టులు, స్టేషన్ల ఆధునీకరణ (మాడర్నైజేషన్), ఎలివేటర్లు, లిఫ్ట్‌లు మరియు ఆర్‌ఓబీ (ROB)/ఆర్‌యుబీ (RUB) నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు.

టెండర్లు ఖరారైనప్పటికీ చిన్న చిన్న సమస్యల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని   అన్నారు. తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లు మరియు వాటర్ వర్క్స్ శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

పెండింగ్‌లో ఉన్న లక్ష్మీదేవిపేట ప్రాజెక్ట్‌కి సంబంధించి రైల్వే శాఖ చేయాల్సిన పనులను పూర్తి చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ₹97-98 కోట్లను రైల్వే శాఖ వెచ్చిస్తోందని, దీనికి సంబంధించి 30 రోజుల వ్యవధితో టెండర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు. ఏజెన్సీల ఎంపికను త్వరలోనే పూర్తి చేసి, రాబోయే దసరా లేదా దీపావళి నాటికి పనులను ప్రత్యక్షంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓ మరియు ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పి ఎం ఈ జి పి), జల జీవన్ మిషన్, అమృత్,  వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) పథకం (VB-G RAM G), ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY), పిఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, CRF పథకం,(సెంట్రల్ రోడ్ ఫండ్), (ప్రస్తుతం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్)(CRIF), మరియు ఇతర కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై  చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  

*స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ...*

అనకాపల్లి జిల్లా నుండి ప్రత్యేక రైళ్లు మంజూరు చేసినందుకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరియు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నందున,  విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ అనకాపల్లి జిల్లాలో హాల్ట్ ఉండే విధంగా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు, బొజ్జన్న కొండ అభివృద్ధి తదితర అంశాలపై పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ను కోరారు.

*జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ....*

*గడువులోగా లక్ష్యాలను సాధించాలని అధికారులకు ఆదేశం*

జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా నిర్వహించిన దిశ (DISHA) కమిటీ  సమావేశం అత్యంత ఫలప్రదంగా ముగిసిందని,  ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అందించిన విలువైన సూచనలు, సలహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని,  నేటి సమావేశంలో నిర్ణయించిన అన్ని అభివృద్ధి లక్ష్యాలను తదుపరి దిశ కమిటీ సమావేశం నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) తమ పరిధిలోని సమస్యలపై ఇచ్చిన సలహాలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించనున్నట్లు  తెలిపారు. ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

*ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై  అధికారులు వివరిస్తూ...*

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గడిచిన సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు (SHG) ₹5.57 కోట్లు (₹5,05,70,000) CIF రివాల్వింగ్ ఫండ్‌గా అందించడం జరిగింది. మహిళలు తమ జీవనోపాధిని  పెంపొందించుకోవడానికి ఈ రుణాలను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కింద 2025-26 సంవత్సరానికి ₹14.11 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరానికి ₹1.05 కోట్లు విడుదలయ్యాయని వివరించారు. 

‘లఖ్‌పతీ దీదీ’ (Lakhpati Didi) పథకం కింద గత సంవత్సరం  సుమారు 68,600 మంది మహిళలను 'లఖ్‌పతీ దీదీ'లుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని, కేంద్రం నుండి వచ్చే PMEGP, PMFME నిధులతో పాటు స్త్రీ నిధి, ఉన్నతి వంటి బ్యాంక్ లింకేజీలను సమన్వయం చేసుకొని మహిళలు సొంత వ్యాపారాలను (Enterprises) ఏర్పాటు చేసుకుంటున్నారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కు విన్నవించారు.  ఈ సంవత్సరం మరో 74,036 మంది మహిళలను లఖ్‌పతీ దీదీలుగా మార్చేందుకు విస్తృతంగా ప్రణాళికలు రూపొందించినట్లు  తెలిపారు. PMEGP, PMFME పథకాల ద్వారా గత ఏడాది ఇచ్చిన టార్గెట్‌ను 100% విజయవంతంగా సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి,  పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్,  అల్లూరి జిల్లా ఐటీడీఏ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిత్య వర్మ,   జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) సమీక్ష సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పత్రిక ప్రతినిధులతో మాట్లాడుతూ......*

అనకాపల్లి  జిల్లా దిశా (DISHA) సమావేశంలో జిల్లా అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. జిల్లాలో మౌలిక వసతులు, రహదారులు, రైల్వే ప్రాజెక్టులు మరియు టెలికమ్యూనికేషన్ రంగాల పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా పరిధిలో మంజూరైన 6 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROB) మరియు 6 రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) పనుల పురోగతిని సమీక్షించామని, రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు ప్రయాణికులకు కావలసిన లిఫ్ట్లు, ఎలివేటర్లు వంటి ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దాదాపు 90 శాతం పనులకు సంబంధించి మంజూర్లు మరియు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి, కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. భూసేకరణ (Land Acquisition) సమస్యలున్న ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

*అనకాపల్లి - రాజమండ్రి 6 లైన్ల రహదారి* 

అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి డిపిఆర్ (DPR) పూర్తయ్యి, ప్రస్తుతం కేబినెట్ ఆమోద ముద్ర దశలో ఉందని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో సౌకర్యం వస్తుండగా, అక్కడి నుండి అనకాపల్లి వరకు ఉన్న 4 లైన్ల రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగినందున, దానిని 6 లైన్ల రహదారిగా మార్చడం, ఇరువైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

 ప్రసిద్ధ జంక్షన్లు, లంకెలపాలెం వంటి ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకుండా నేరుగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి, ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా పటిష్టమైన ప్రణాళికను రూపకల్పన చేస్తున్నామన్నారు.  గత రెండేళ్లుగా అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి వంటి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు రావడంతో ఉపాధి అవకాశాలు లభించడమే కాక రవాణా విపరీతంగా పెరిగింది.  పారిశ్రామిక వేగంతో పోలిస్తే అచ్యుతాపురం తదితర పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఫ్రీక్వెన్సీ కొరత ఉంది. ఈ సమస్య పరిష్కారానికి బిఎస్ఎన్ఎల్ (BSNL), ఎయిర్‌టెల్, జియో ప్రతినిధులతో సమన్వయం చేసుకొని జిల్లావ్యాప్తంగా కొత్తగా దాదాపు 70 నుండి 80 కొత్త టెలికం టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే 6 నెలల్లో జిల్లా అంతటా పూర్తిస్థాయి నెట్‌వర్క్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 100కు పైగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 'విబి రామ్‌జీ' వంటి నూతన కార్యక్రమాల అమలు పురోగతిపై జిల్లా అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

*జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి*ఎల్ నినో ప్రభావం వల్ల చాలా గ్రామాల్లో తాగునీరు, సాగునీటి తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లాను 'కరవు జిల్లా'గా ప్రకటించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రభుత్వాన్ని కోరామని, జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటిస్తే కేంద్రం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధుల ద్వారా అదనపు సహాయం అందుతుందని, దాని ద్వారా రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు నీటి ఎద్దడి తీర్చవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

జిల్లా సమగ్ర వికాసానికి, ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 



Post a Comment

0 Comments