విశాఖపట్నం, సెప్టెంబర్ 3:తెలుగుదేశం పార్టీలోకి యువనాయకురాలు కొల్లాబత్తుల ప్రసూన రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ స్వాగతించారు. విశాఖలోని టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 47వ వార్డుతో పాటు వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, సీనియర్ కార్యకర్తలు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ప్రసూనతో పాటు ఆమె అనుచరులు 13 మందికి ఎంపీ శ్రీభరత్ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ.. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి దుబాయ్‌లో మంచి ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాజీవితంలోకి రావాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
ప్రజాసేవే రాజకీయాలకు ప్రాథమిక లక్ష్యంయువత మంచి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని, ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో ముందుకు సాగాలని శ్రీభరత్ ఆకాంక్షించారు. మంచి పేరు సంపాదించుకునేలా పనిచేస్తేనే రాజకీయ జీవితం సార్థకమవుతుందని అన్నారు.అభివృద్ధితో పాటు జీవనశైలిలో మార్పు అవసరం
రాష్ట్రంలో పెట్టుబడులు రావడం, పరిశ్రమలు ఏర్పడటం, ఉద్యోగాలు లభించడం మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదని శ్రీభరత్ అన్నారు. ప్రజల జీవనశైలిలో కూడా సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
విశాఖపట్నానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
చట్టాలను గౌరవించే పౌర సమాజం అవసరంప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రజలు చట్టాలను క్రమశిక్షణతో పాటిస్తున్నారని, మన నగరాల్లో కూడా అదే సంస్కృతి పెంపొందాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు.ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పటికీ ప్రజల సహకారం లేకుండా సంపూర్ణ మార్పు సాధ్యం కాదన్నారు.
మార్పు ఒక్కరోజులో రాదని, నిబద్ధతతో, ఓపికతో నిరంతరం పనిచేస్తే కాలక్రమేణా మంచి ఫలితాలు వస్తాయని శ్రీభరత్ పేర్కొన్నారు.
పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు నీటి భద్రత
వర్షాలు సక్రమంగా లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి అనేక ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తిందని శ్రీభరత్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా నీటి లభ్యతకు మరింత భరోసా ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని శ్రీభరత్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పోలవరం పనులను వేగవంతం చేసి, ఈ టర్మ్‌లో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
ఇప్పటికే అనకాపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని, త్వరలోనే విశాఖపట్నానికి కూడా పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఉత్తరాంధ్రకు నీటిని తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
కలిసికట్టుగా పనిచేస్తే వార్డుల అభివృద్ధి వేగవంతం
కొల్లాబత్తుల ప్రసూన స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేయాలని శ్రీభరత్ సూచించారు. వార్డులోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయగలమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“మంచి దారిని ఎంచుకుని, ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రసూన గారికి, ఆమెతో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం” అని ఎంపీ శ్రీభరత్ అన్నారు....
విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం టిడిపి అధ్యక్షులు చోడే పట్టాభిరామ్ మాట్లాడుతూపోలవరం, అమరావతి చంద్రబాబు కలలని గత ప్రభుత్వ హయాంలో
పోలవరం, అమరావతిల పై నిర్లక్ష్యం, అవరోధాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు.వాటిని పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని పేర్కొన్నారు....
కూటమి ప్రభుత్వ హయాంలో ఎంపీ శ్రీభరత్ సహకారంతో విశాఖపట్నంలో రైల్వే జోన్ నుంచి డేటా సెంటర్ల వరకు అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు...
ఈ కార్యక్రమంలో విశాఖ టిడిపి ఉత్తర నియోజకవర్గం పరిశీలకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, మాజీ కార్పొరేటర్ హనూక్ ఉత్తర నియోజకవర్గం నాయకులు తదితరులు పాల్గొన్నారు..





0 Comments