క్వాంటం, ఏఐ క‌ల‌సి ప‌నిచేస్తాయి


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, సెప్టెంబ‌ర్ 3:క్వాంటమ్ మరియు AI అనేవి వేర్వేరు రంగాలుగా ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో ఇవి రెండూ కలిసి పనిచేస్తాయ‌ని బార్క్‌(ముంబాయి) సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్ అన్నారు.  ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న మూడు రోజుల అంత‌ర్జాతీయ స‌ద‌స్సు క్వాంటం ఎన్‌హేన్స్‌డ్ స‌స్టైన‌బుల్ టెక్నాల‌జీ ఫ‌ర్ ఏఐ సిస్ట‌మ్స్ ( క్వెస్ట్‌-ఏఐ ) స‌దస్సులో మూడ‌వ రోజు ముగింపు వేడుక‌లకు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సు ఇతివృత్తం "క్వాంటమ్ అండ్ AI సస్టెయినబుల్ టెక్నాలజీస్ ఫర్ AI సిస్టమ్స్" చాలా ఆసక్తికరమైన అంశమ‌న్నారు. ఇది  జాతీయ స్థాయిలో  విధాన నిర్ణేతల  మధ్య అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయంగా మారిందన్నారు. మన AI వ్యవస్థలను సుస్థిరంగా ఎలా తీర్చిదిద్దాలి అనేది ఒక ప్రధానమైన సవాలుగా నిలుస్తోంద‌న్నారు.

డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నప్పటికీ, వాటన్నింటికీ అవసరమైన విద్యుత్ శక్తిని అందించడమే అతిపెద్ద సవాలుగా మారిందన్నారు.   డేటా సెంటర్లను 'అణు విద్యుత్' తో న‌డిపే దిశ‌గా ఆలోచ‌న చేయాల‌న్నారు. అణు విద్యుత్ హరిత ఇంధనమ‌ని, బొగ్గు త‌ర‌హాలో ఇది కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదన్నారు. పారిస్ ఒప్పందం  ప్రకారం మనం 'నెట్ జీరో'  లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థలను సుస్థిరంగా నిర్వహించడానికి అణు విద్యుత్ ఒక్కటే మార్గమ‌న్నారు.

పెద్ద డేటా సెంటర్ కంపెనీలు అంతరిక్షంలో త‌మ‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు.  డేటా సెంటర్లకు విద్యుత్‌, శీత‌లీక‌ర‌ణ ఎంతో ప్ర‌ధాన‌మ‌న్నారు. ఈ రెండు సమస్యలకు అంతరిక్షంలో సహజమైన పరిష్కారం లభిస్తుందన్నారు. భవిష్యత్తు డేటా సెంటర్లు 'క్వాంటమ్ ఎన్‌హాన్స్డ్ AI డేటా సెంటర్లు' గా మారబోతున్నాయన్నారు. 

విశ్వ‌విద్యాల‌యాల ప‌రిశోధ‌న‌లు నిజ‌జీవితంలోకి తీసుకువెళ్లాల‌ని అసోసియేట్ ప్రొఫెస‌ర్- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (బాండ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రేలియా)  గ్రెగ్‌ స్కుల్మోస్కీ అన్నారు. ప‌రిశోధ‌న‌ల‌కు వ్యాపార విలువ‌ను జోడించాల్సిన విధానాల‌ను వివ‌రించారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అనేది ప్రణాళికలు రచిస్తూ, ప్రాజెక్ట్‌లను నిర్వహించడానికి అవసరమైన సాధనాలను, ప్రక్రియలను అందిస్తుంద‌న్నారు.

ఏయూ ఆచార్యులు బి.ఆర్ రావు  రూపొందించిన పరిశోధనా నమూనాను ఉద‌హ‌రిస్తూ ఈ ప‌రిశోధ‌న‌ వ్యవస్థ నేడు 55 దేశాలలో అందుబాటులో ఉంద‌ని, దీనిని దాదాపు 60,000 మంది దీనిని ఉపయోగిస్తున్నారన్నారు. ఆయన తన పరిశోధనను విజయవంతంగా ఒక ప్రాజెక్ట్‌గా మలచి ప్రపంచానికి అందించారన్నారు. మ‌నం పరిశోధనా ప్రాజెక్ట్‌ను నిర్వ‌హిస్తూ సమాజానికి విలువను అందించడమే అసలైన మార్గమ‌న్నారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లో ప్ర‌ధానంగా సంస్థ  సంసిద్ధ‌త క‌లిగి ఉండ‌టం అక్క‌డ పనిచేసే వ్యక్తులు తగినంత నైపుణ్యం కలిగి ఉండాలన్నారు.  ప్రమాదాలను, నష్టాలను తగ్గించి, విజయావకాశాలను పెంచడమే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రధాన విలువ  అని చెప్పారు. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను వాణిజ్యీకరించి, సమాజ సమస్యలకు పరిష్కారాలను అందించవచ్చు. పరిశోధనను సరిగ్గా అర్థం చేసుకుంటే, భవిష్యత్తును ముందే ఊహించి క్రియాశీలకంగా వ్యవహరించవచ్చున‌న్నారు.  భవిష్యత్తులో రాబోయే అవకాశాలు, ఉద్యోగాలు, వ్యాపార మార్గాలను ఇటువంటి ప్రణాళికతో సాధించ‌డం వీల‌వుతుంద‌న్నారు. హైబ్రిడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విధానం  వివ‌రించారు.

వినియోగదారులు మన ఉత్పత్తితో సంతృప్తిగా ఉన్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాల‌న్నారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని, దానికి అనుగుణంగా తదుపరి మార్పులను చేయాల‌ని, ఇదొక నిరంతర అభివృద్ధి ప్రక్రియగా నిలుస్తుంద‌న్నారు.  ప్రతి సంస్థ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్‌పై పెట్టుబడి పెట్టే ముందు దాని బిజినెస్ కేస్ ఏమిటి, దాని ద్వారా ఎంత ప్రయోజనం ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నారు. అది సంస్థ యొక్క ప్రధాన వ్యూహానికి అనుగుణంగా ఉండాలని, అది అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాల్సి ఉంటుంద‌న్నారు.

ఎన్‌.ఐ.టి వరంగ‌ల్ ఆచార్యులు ఎన్‌.వి.ఎస్‌.ఎన్ శ‌ర్మ టెరాహెడ్జ్ టెక్నాల‌జీపై ప్ర‌సంగించారు. భ‌విష్య‌త్ త‌రం ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు అభివృద్ది చేస్తున్న విధానాల‌ను వివ‌రించారు. వైద్య రంగంలో విక్ర‌యించే ఔష‌ధాలలో న‌కిలీల‌ను గుర్తించే విధానం, ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే పార్సిల్స్‌ను తెర‌వ‌కుండా ప‌రిశీలించే విధానాల‌ను తెలియ‌జేశారు. వైద్య రంగంలో టెరాహెడ్జ్ సాంకేతిక వినియోగం వ‌ల‌న జ‌రిగే మేలు ఉదాహ‌ర‌ణ‌ల‌తో తెలిపారు. ఈ రంగంలో ప‌రిశోధ‌న‌కు విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. 

మూడు రోజుల అంత‌ర్జాతీయ స‌దస్సు ఘ‌నంగా ముగిసింది. దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చిన నిపుణుల ప్ర‌సంగాలు, టెక్నిక‌ల్ సెష‌న్స్‌, పేప‌ర్‌, పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్ కార్య‌క్ర‌మంలో యువ‌త ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వెంట‌క సుబ్బ‌య్య‌, స‌ద‌స్సు చైర్‌, పాల‌క మండ‌లి స‌భ్యురాలు,సి.ఎస్.ఇ విభాగాధిప‌తి, డీన్‌(ఆర్‌&డి)  ఆచార్య‌ వి. వల్లి కుమారి, అవుట్‌రీచ్ విభాగం డీన్ ఆచార్య కె.ర‌మా సుధ‌, విభాగాధిప‌తులు ఆచార్య టి.ఆర్ జ్యోత్స్న‌, డి.ల‌లిత భాస్క‌రి, పి.వి శ్రీ‌దేవి, పి.స్వ‌ప్న‌, రూసా స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆచార్య‌ కె.వెంక‌ట రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. రూసా 2.0 స‌హ‌కారంతో ఏయూలో తొలిసారిగా క్లస్టర్ విధానంలో  సీ.ఎస్.ఈ, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాలకు చెందిన అధ్యాపకులు కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నారు.

Post a Comment

0 Comments