ఆంధ్రవిశ్వవిద్యాలయం, సెప్టెంబర్ 3:వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో విద్య కీలకంగా నిలుస్తుందని ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ బి.శ్రీనివాస్ అన్నారు. ఏయూ కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఆర్ట్స్-కామర్స్ కళాశాల ఆధ్వర్యంలో ఆచార్య కె.వి శివయ్య శత జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ సదస్సు రీ ఇమేజినింగ్ కామర్స్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బి.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ @2047’ కేవలం ఆర్థిక లక్ష్యాలకు మాత్రమే పరిమితమైనది కాదని, అది ఒక జాతీయ ఆకాంక్ష అని అన్నారు. అభివృద్ధి చెందిన, స్వయంసమృద్ధి కలిగిన, నవకల్పనలతో, డిజిటల్ సాధికారతతో ప్రపంచస్థాయిలో పోటీపడగల భారతదేశ నిర్మాణం దీని లక్ష్యమన్నారు. ఈ ఆకాంక్షకు సాకారం చేయడంలో అత్యంత కీలకమైనది విద్య అని చెప్పారు.
ప్రతి ఆర్థిక కార్యకలాపం సామాజిక బాధ్యతను పెంచుతుందని, బాధ్యతాయుతమైన వాణిజ్యమే దేశ సమృద్ధికి చోదక శక్తిగా మారుతుందన్నారు. వాణిజ్యానికి, సమాజానికి, దేశ నిర్మాణానికి నడుమ ఉన్న ఈ అనుబంధం మన దేశానికి సుపరిచితమేనని ఉదాహరణలతో వివరించారు. వ్యాపారానికి ఎల్లప్పుడూ 'నమ్మకం' అవసరం, ఆ నమ్మకానికి ఒక స్పష్టమైన వర్తక వ్యవస్థ అవసరం. ఆ వ్యవస్థనే నేడు మనం 'మేనేజ్‌మెంట్' (నిర్వాహణ) అని పిలుస్తున్నాం.
భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థకు తగినట్లుగా విద్యా వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సి ఉందన్నారు. కామర్స్ మరియు మేనేజ్‌మెంట్ విద్యను ప్రసుతం వేగంగా మారిపోతున్న నేటి ఆర్థిక వ్యవస్థకు తగినట్లు మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గీతం వర్సిటీ పూర్వ వీసీ, ఏయూ ఆర్ట్స్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.గంగాధర రావు మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా జరిగే ప్రయాణంలో ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందన్నారు. దీనిలో భాగంగా మన ఉన్నత విద్యా వ్యవస్థ తీవ్రమైన రూపాంతరాన్ని చెందాల్సి ఉందని సూచించారు. ఉన్నత విద్యలో ఒక ముఖ్యమైన భాగమైన కామర్స్, మేనేజ్‌మెంట్ విద్యలో గణనీయమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు. నిన్నటి పాఠ్యాంశాలతో రేపటి సవాళ్లను మనం పరిష్కరించలేమనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు.భవిష్యత్తు నాయకత్వం అనేది విభిన్న సంస్కృతులు, సరిహద్దు దాటి డిజిటల్ సాంకేతికతతో ముడిపడి ఉంటుందన్నారు. ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలను తయారుచేసే దిశగా విద్యా కార్యక్రమాలు సాగాలన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలమం మాజీ వీసీ ఆచార్య వి.బాల మోహన్ దాస్ మాట్లాడుతూ కామర్స్, మేనేజ్‌మెంట్ విద్య ఇప్పటికే రూపాంతరం చెందుతూ వచ్చిందన్నారు. ఏయూలో ప్రొఫెసర్ కె.వి. శివయ్య చేసిన కృషిని వివరించారు. గతంలో తాను 1990లో ప్రొఫెసర్ కె.వి. శివయ్య ఆధ్వర్యంలో 'కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్' అనే పుస్తకాన్ని మేము తీసుకువచ్చామని, ఈ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలన్నింటితో కలిపి మరొక కొత్త గ్రంథం తీసుకురావాలన్నారు.
ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ ప్రొఫెసర్ కె.వి. శివయ్య గారి శతాబ్ది స్మారకోత్సవం అనేది కేవలం ఒక విశిష్ట విద్యావేత్తను స్మరించుకునే సందర్భం మాత్రమే కాదన్నారు.
విద్యా రరంగంలో అత్యుత్తమ ప్రమాణాలు, దేశ నిర్మాణం, పరిశోధనలు మరియు మేనేజ్‌మెంట్ విద్యకు ఆయన అందించిన శాశ్వత వారసత్వాన్ని పండుగలా జరుపుకునే వేడుకగా ఇది నిలుస్తుందన్నారు. విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు మరియు విద్యార్థులు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, అలాగే కామర్స్ మరియు మేనేజ్‌మెంట్ విద్యలో ఉద్భవిస్తున్న సవాళ్లు-అవకాశాలపై చర్చించడానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుందని నేను విశ్వసిస్తున్నానన్నారు.
సదస్సు నిర్వాహకులు ఆచార్య బి.మోహన వెంకట రామ్ మాట్లాడుతూ సదస్సుకు 80 పరిశోధన ప్రతాలు వచ్చాయన్నారు. ఆచార్య కె.వి శివయ్య శత జయంతిలో భాగంగా ఈ రోజు సదస్సును నిర్వహిస్తున్నామని, శుక్రవారం ఆచార్య కె.వి శివయ్య శత జయంతిని జరుపుతామన్నారు.
విభాగాధిపతి ఆచార్య ఎం.ఉమాదేవి మాట్లాడుతూ విభాగ స్థాపన, ప్రగతి, వికాసం వివరించారు. సదస్సు ప్రత్యేకతలు, ప్రాధాన్యతలను తెలియజేవారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments