SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన నేపథ్యంలో, వారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఎంపీ సోమవారం కోరారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఆగస్టు 3, 2026న ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి MO 135 చేపల బోటులో సముద్రంలోకి వెళ్లారని, వారు ఆగస్టు 15 లేదా 16 తేదీల్లో తిరిగి రావాల్సి ఉండగా, అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, భారత కోస్ట్ గార్డ్, భారత నావికాదళం, మెరైన్ పోలీస్‌తో పాటు ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఆగస్టు 17 నుంచి కోస్ట్ గార్డ్, నావికాదళ నౌకలను ప్రతిరోజూ గాలింపు చర్యలకు మోహరించడంతో పాటు, రెండు డోర్నియర్ విమానాలను కూడా వినియోగిస్తున్నామని మంత్రికి వివరించారు.
కాకినాడ, విశాఖపట్నం, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుంచి కోస్ట్ గార్డ్ వనరులను సమీకరించి బంగాళాఖాతంలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారని, గాలింపు పరిధిని ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వరకు విస్తరించడంతో పాటు, సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు కూడా గల్లంతైన పడవను గమనించి, ఏదైనా సమాచారం లభించిన వెంటనే అధికారులకు తెలియజేయాలని నవ్టెక్స్ సందేశం ద్వారా కోరారన్నారు. అయితే, గల్లంతైన పడవలో AIS, DAT లేదా శాటిలైట్ ఫోన్ వంటి కమ్యూనికేషన్/ట్రాకింగ్ పరికరాలు లేకపోవడం వల్ల దాని కచ్చితమైన స్థానాన్ని గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని ఇన్కాయిస్ కు చెందిన సరాట్ వ్యవస్థ ద్వారా గుర్తిస్తున్న అత్యంత సంభావ్య గాలింపు ప్రాంతాన్ని ప్రతిరోజూ నవీకరిస్తూ సముద్రంలో ఉన్న గాలింపు బృందాలకు అందిస్తున్నారన్నారు. ప్రస్తుత సముద్ర ప్రవాహాల ఆధారంగా పడవ తూర్పు లేదా ఈశాన్య దిశగా కొట్టుకుపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పడవ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎం ఆర్ సి సి ఢాకా, మయన్మార్ అధికారులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు. మత్స్యకారులు సుమారు 17 రోజులకు సరిపడా ఆహార సామగ్రిని వెంట తీసుకెళ్లినప్పటికీ, ఆ వ్యవధి ఇప్పటికే గణనీయంగా దాటిపోయింది. దీంతో సమయం అత్యంత కీలకంగా మారిందని, గాలింపు చర్యలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. గల్లంతైన బోటు మరియు మత్స్యకారుల ఆచూకీకి సంబంధించిన చిన్న సమాచారం లభించినా వెంటనే సంబంధిత అధికారులకు చేరేలా సమన్వయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల సంబంధిత సముద్ర భద్రతా, శోధన రక్షణ సంస్థలతో అవసరమైన అంతర్జాతీయ సమన్వయాన్ని మరింత పెంచాలని కోరారు. ప్రతి గంటా ఎంతో విలువైనదని, ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, వారి సురక్షిత ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి, గాలింపు చర్యలను సాధ్యమైనంత విస్తృత స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉందని, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించే వరకు అన్ని అవకాశాలను వినియోగిస్తూ చర్యలు కొనసాగించాలి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను ఎంపీ హరీష్ కోరారు.

0 Comments