సింహాచలం, 27 ఆగస్టు 2026: శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం ఉదయం సింహగిరిపై వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులతో కలిసి కొండపై పలు ప్రాంతాలను పరిశీలించిన ఈఓ, కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. గత వారం అధికారులకు సూచించిన పనుల్లో ఇప్పటివరకు ఎంత మేర పురోగతి సాధించారనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా సింహగిరిపై పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈఓ, శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, ఎక్కడైనా సమస్యలు కనిపిస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం గజపతి సత్రమునకు వెళ్లే మార్గము వద్ద అదనంగా మరో రెండు వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
అనంతరం ఆన్‌లైన్ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని సందర్శించిన ఈఓ, అక్కడ ప్రసాదాల నిల్వ, నాణ్యత, విక్రయ విధానం తదితర అంశాలను పరిశీలించారు. భక్తులకు ప్రసాదాల అందుబాటులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సింహగిరిపై భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ఇంజనీరింగ్ పనులు, పారిశుధ్య నిర్వహణతో పాటు భక్తుల మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.






0 Comments