జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైలీ వేజ్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ గురుమూర్తికి వినతి*


 తిరుపతి: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో డైలీ వేజ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది బుధవారం తిరుపతిలోని ఎంపీ డా. మద్దిల గురుమూర్తి కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు.

విశ్వవిద్యాలయంలో మొత్తం 46 మంది ఎస్ఎంఆర్, డైలీ వేజ్ సిబ్బంది పనిచేస్తున్నారని వారు తెలిపారు. వీరిలో కొంతమంది 2002 సంవత్సరం నుంచి సేవలు అందిస్తున్నారని, చివరిగా 2016 వరకు నియామకాలు జరిగినట్లు పేర్కొన్నారు. తాము నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రస్తుతం తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.

2021లో తమను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగినప్పుడు ఉద్యోగ భద్రతపై ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ కేసులో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం తమకు టైమ్ స్కేల్ ఆఫ్ పే మంజూరు చేయాలని కోరుతూ 2023లో మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

ఇటీవల ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తమకు టైమ్ స్కేల్ మంజూరు చేయాలని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని ఎంపీ గురుమూర్తిని కోరారు. వారి సమస్యను సానుకూలంగా పరిశీలించిన ఎంపీ గురుమూర్తి, హైకోర్టు ఆదేశాలు, ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments