ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు 27:సంస్థ సుస్థిర ప్రగతికి ప్రమాణాలు దోహదపడతాయని రియల్ టైమ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీఈఓ శ్రీనివాస్‌రావు గరిమెళ్ల అన్నారు. ఏయూ ఔట్‌రీచ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్గత ఆడిటర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ప్రతి కార్యకలాపాన్ని ఒక నిర్దిష్ట ప్రక్రియగా పరిగణించి, దానికి అనుగుణంగా ప్రామాణిక నిర్వహణ విధానాలు (SOP) రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రవేశాలు, పరీక్షలు, తరగతి బోధన, పరిశోధన, పరిపాలన తదితర ప్రతి ప్రక్రియ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం అమలయ్యే విధంగా నిరంతరం పరిశీలన జరపడానికి అంతర్గత ఆడిట్లు కీలకమని పేర్కొన్నారు.
త్వరలో జరిగే ధ్రువీకరణకు సిద్ధం కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత అంతర్గత ఆడిట్లు, వాటి నాణ్యతను మెరుగుపరచడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. భవిష్యత్తులో అమల్లోకి వచ్చే సవరించిన ఐ.ఎస్.ఓ (ISO) ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతా విధానాలు, నాణ్యతా మాన్యువల్స్, ప్రక్రియలను పునఃసమీక్షించి అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఐ.ఎస్.ఓ(ISO) ప్రమాణాల అమలు కేవలం ధ్రువీకరణ కోసమే కాకుండా, నాక్(NAAC) గుర్తింపు ప్రక్రియకు కూడా విశ్వవిద్యాలయాన్ని మరింత సమర్థంగా సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం నాణ్యతా ప్రమాణాల అమలులో ముందంజలో ఉన్నప్పటికీ, వ్యవస్థలో ఉన్న కొన్ని అంతరాలను గుర్తించి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. డేటా సేకరణ, విశ్లేషణ, భవిష్యత్ ప్రణాళిక వంటి అంశాల్లో మరింత మెరుగుదల అవసరమన్నారు. వీటికోసం స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, నాణ్యతా వ్యవస్థలు నిరంతరం కొనసాగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని, అదే సమయంలో వాటిని నిర్దేశిత ప్రమాణాలతో నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు.బోధన, పరీక్షలు, ప్రవేశాలు, పరిపాలన, పరిశోధన వంటి అన్ని కార్యకలాపాలకు స్పష్టమైన ప్రమాణాలు, SOPలు ఉండాలని, అవి సమర్థవంతంగా అమలయ్యే విధంగా అంతర్గత ఆడిట్ల ద్వారా నిరంతరం పరిశీలించాలని సూచించారు. భవిష్యత్‌లో సవరించిన ప్రమాణాలకు మారే క్రమంలో విశ్వవిద్యాలయ నాణ్యతా నిర్వహణ వ్యవస్థను పునఃసమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టాలని అన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాణ్యతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు అంతర్గత ఆడిటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అవుట్‌రీచ్ విభాగం డీన్ ఆచార్య కె. రమసుధ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని వివిధ ప్రక్రియలకు ప్రామాణిక నిర్వహణ విధానాలు (SOP) రూపొందించి, వాటి అమలును నిరంతరం ఆడిట్ చేయడమే శిక్షణ ఉద్దేశమన్నారు.ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ కె.వెంకట రమణ కార్యక్రమానికి స్వాగతం కలపగా, అవుట్ రీచ్ విభాగం అసోసియేట్ డీన్ ఆచార్య పి.వెంకట రావు వందన సమర్పణ చేసారు. కార్యక్రమంలో బ్రాండింగ్-మీడియా అసోసియేట్ డీన్ ఆచార్య సి.ఎం వినయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా శిక్షణ తరగతుల సమాచారాన్ని విడుదల చేసారు. వర్సిటీ తరపున శ్రీనివాస రావును సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు.




0 Comments