ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు 25:యువత సమాజంపై అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పత్రిక పూర్వ ఎడిటర్ జి.వల్లీశ్వర్ అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ హిందీ విభాగాన్ని ఆయన సందర్శించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం, భాషలలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలని సూచించారు. పత్రికా రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక విధానాలను వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియం నుంచి డిజిటల్ యుగంలోకి మీడియా మారిందని, ఈ రంగంలో మీడియా పాత్ర, జర్నలిజంలో భాష ప్రాధాన్యత వివరించారు. హిందీ-తెలుగు భాషల మధ్య సాహిత్య, సాంస్కృతిక సంబంధాలను వివరించారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను పెంపొందించుకుంటూ, సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను యువతరం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులతో పాత్రికేయ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు.
విభాగం తరపున జి. వల్లీశ్వర్, పారిశ్రామికవేత్త చెరువు రామకోటయ్యలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందీ పరిషత్ అద్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించగా, హిందీ విభాగాధిపతి ఆచార్య నల్లా సత్యనారాయణ, హిందీ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మెన్ ఆచార్య జర్రా అప్పారావులు సమన్వయం చేసారు. విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ ఇటువంటి విశిష్ట వ్యక్తుల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య నల్లా సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని నింపే విధంగా అతిధులు ప్రసంగాలు నిలచాయన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు విశ్రాంత ఆచార్యులు వెలమ సిన్నన్న , హిందీ అతిధి అధ్యాపకులు డా. వేడంగి సరోజిని, డా. ఎస్. జగదీష్, డా. షేక్ రహిమా, పరిశోధకులు షేక్ హుస్సైన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments